ఎంఎం కీరణవాణి.. ఎన్నో సినిమాలకు అత్యద్భుతమైన సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్. ‘RRR’ సినిమాతో ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యామిలీ, లైఫ్ స్టైల్ గురించి నెటిజన్లు బాగా వెతుకుతున్నారు. గతంలో ఆయన లైఫ్ స్టైల్ కు సంబంధించిన వీడియోలు, అవార్డుల గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


ఆధునిక, సంప్రదాయ పోకడలతో ఇంటి నిర్మాణం


హైదరాబాద్ లోని ఆయన నివాసం ఆధునిక, సంప్రదాయ పోకడలతో అత్యద్భుతంగా ఉంటుంది. బయట నుంచి చూడ్డానికి విలాసవంతమైన అపార్ట్ మెంట్ లా కనిపించే ఆయన నివాసం.. లోపల మాత్రం సంప్రదాయపు హంగులను అద్దుకుని ఉంటుంది. ఆయన తన ఇంటిని మండువా లోగిలి ఇల్లుగా తీర్చిదిద్దారు. ఆయన ఇల్లు చూస్తే హైదరాబాద్ నగరంలో ఉన్నామా? గోదావరి జిల్లాల్లోని పల్లెటూరిలో ఉన్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆయన కిచెన్ సైతం చక్కటి పల్లెటూరి వంటగదిలా కనిపిస్తుంది. ఉదయాన్నే లేవగానే మండువా లోగిలిలో కూర్చుని టీ తాగుతూ  పేపర్ చదవడం ఆయనకు అలవాటు. ప్రతి రోజు తప్పకుండా షేవ్ చేసుకుంటారట.  ఆ తర్వాత స్నానం చేసి ఇష్ట దైవం ఆంజనేయ స్వామికి పూజ చేస్తారు. ఆ తర్వాత విబూది పెట్టుకుంటారు. తన పిల్లలకు కూడా విబూది రాస్తారు. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. అందులో ఎక్కువగా పండ్లు తీసుకుంటారు. ఆ తర్వాత ల్యాబ్ కు వెళ్లి రికార్డింగ్స్ లో బిజీ అవుతారు. మధ్యాహ్నం వరకు రికార్డింగ్ లో పాల్గొన్న తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుంటారు. తన సోదరుడు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కలిసి ఒకే ప్లేట్ లో లంచ్ చేయడం చాలా కామన్ గా కనిపిస్తుంటుంది.   


మా ఇంట్లో సోఫాలు ఉండవు - కీరవాణి


ఇక తన ఇంటిని ట్రెడిషనల్ గా నిర్మించడంలో తన భార్యదే కీలకపాత్ర అన్నారు కీరవాణి. తన భార్య కజిన్ హేమలత ఈ ఇంటిని డిజైన్ చేసినట్లు చెప్పారు. తన ఇంట్లో సోఫాలు ఉండవని చెప్పారు. సోఫా ఉండటం వల్ల రిలాక్స్ గా కూర్చుంటారని, వెంటనే నిద్ర వచ్చేస్తుందన్నారు. అలాగే కూర్చుని గంటల తరబడి టీవీలు చూడటం లాంటి చెడ్డ లక్షణాలు వస్తాయని చెప్పారు. వాటిని అవాయిడ్ చేయడం కోసమే సోఫాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎవరైనా రిలాక్స్ గా కాకుండా అలర్ట్ గా కూర్చోవాలని ఇలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  


అవార్డులను చూస్తే అహంకారం వస్తుంది- కీరవాణి


ఇక తనకు ఎన్నో అవార్డులు వచ్చినా, వాటిని ప్రదర్శనకు పెట్టలేదని చెప్పారు. వాటి వల్ల అహంకారం పెరుగుతుందని చెప్పారు.  ఇన్ని అవార్డులు వచ్చాయి. నాకంటే గొప్పవాడు లేడు అనే స్థితికి చేరుకుంటామన్నారు.  అందుకే వాటిని అల్మారాలో డిస్ ప్లేకు పెట్టలేదన్నారు.  ఇక తన వర్క్ విషయంలో భార్య ఎంతగానో అండగా ఉంటుందన్నారు. తన భార్య తనకు ఏమేం చేయకూడదో చెప్తుందన్నారు. వాటి ద్వారా ఏం చేయాలో తెలుస్తుందని కొన్నాళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తనకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అని చెప్పారు. పెద్దబ్బాయి  కాళ భైరవ. రెండో అబ్బాయి సింహ. అమ్మాయి పేరు కుముర్హతి అన్నారు.  పిల్లలందరికీ మ్యూజిక్ అంటే ఇష్టం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటే మంచిదన్నారు. మద్రాసులో ఉండగా పిల్లలను బాగా మిస్ అయినట్లు చెప్పారు.  సంవత్సరానికి 23 సినిమాలు చేసే వాడినని అందుకే పిల్లలతో ఎక్కువ సమయం గడిపే వాడిని కాదన్నారు. ప్రస్తుతం పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నట్లు అప్పట్లో చెప్పారు. అయితే, ఇప్పుడు కీరవాణి పిల్లలు కూడా టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. పెద్ద అబ్బాయి కాళ భైరవ సంగీత దర్శకుడిగా అదరగొడుతున్నాడు. రెండో కొడుకు సింహా ఇప్పటికే ‘మత్తు వదలరా’ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులు కొట్టేశాడు. అయితే, సింహా కెరీర్ ఇంకాస్త గాడిలో పడాల్సి ఉంది. 



Read Also: ‘ఉ అంటావా’ పాటకు అక్షయ్, నోరా ఫతేహీ డ్యాన్స్ - బన్నీ, సామ్‌లను దింపేశారుగా, ఇదిగో వీడియో