‘ఈరోజు కూరలో ఉప్పు సరిపోలేదు, బాగోలేదు’ అంటూ కామెంట్లు వినిపిస్తాయి ఎన్నో ఇళ్లల్లో. నిజానికి ఉప్పు సరిపోని ఆహారమే ఆరోగ్యకరం. ఆహారంలో ఉప్పు ఉండటం ముఖ్యమే. కానీ అది అధికమైతే మాత్రం చాలా ప్రమాదం. భోజనం చేసేటప్పుడు చాలా మంది పక్కన  ఉప్పు డబ్బా పెట్టుకుంటారు. ఆహారంలో ఉప్పు సరిపోకపోతే చాలు... తీసి పైన చల్లుకొని కలుపుకొని తినేస్తూ ఉంటారు. ఉప్పే శరీరంలోని అవయవాలకు హాని కలిగించే ప్రధాన అంశం. ఉప్పు సరిపోకపోయినా అలా తినేస్తే వందేళ్లు సంతోషంగా బ్రతకచ్చు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులు బారిన పడకుండా ఉండొచ్చు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అవయవాలకు హాని కలుగుతుంది.


ఉప్పు శరీరంలో అధికమైనప్పుడు మూత్రపిండాలు అధికంగా పనిచేయాల్సి వస్తుంది. అవి అదనపు ద్రవాలను ఫిల్టర్ చేయలేవు. ఫలితంగా రక్త పోటు పెరిగిపోతుంది. అధిక రక్తపోటు వస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వంటివి కూడా రావచ్చు. కాబట్టి ఉప్పును తగ్గించుకుంటే ప్రాణాంతక రోగాలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. 


ఉప్పు తినే అలవాటు మీకు ఉంటే వెంటనే మానేయండి. ఎందుకంటే శరీరంలో ఉప్పు ఎక్కువ అవ్వడం వల్ల నీరు నిలిచిపోతుంది, ఉబ్బినట్లు కనిపిస్తుంది. శరీరం సోడియం స్థాయిలను నిర్వహించడానికి అధికంగా కష్టపడుతుంది. ఇందుకోసం శరీరంలో నీటిని ఎక్కువ నిల్వ చేస్తుంది. అలా ఎక్కువ ఉప్పు తినడం వల్ల మీరు నిలిచిపోయి, మనిషి ఉబ్బినట్టు కనిపిస్తారు. ఇక దీర్ఘకాలం పాటు సాగితే మూత్రపిండాలపై కూడా ప్రభావం పడుతుంది.


ఉప్పు వల్ల బోలు ఎముకల వ్యాధి అంటే ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ముందు చెప్పినట్టుగా అధిక ఉప్పు వినియోగం శరీరంలో ద్రవం పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఇది కాల్షియంను విసర్జించేలా చేస్తుంది. దీనివల్ల ఎముకలు క్షీణిస్తాయి. ఆస్టియో పోరాసిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం పెరుగుతుంది.


ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నీరు ఆదా అవుతుందని ముందే చెప్పాం. అంతే కాదు అధిక ఉప్పు తీసుకోవడం వల్ల దాహం కూడా పెరుగుతుంది. మీ శరీరం అదనపు సోడియంను విసర్జించలేక దాన్ని పలుచన చేసేందుకు అదనపుద్రవాలను ఉపయోగిస్తుంది. అయితే మూత్రం ద్వారా ఆ అదనపు ద్రవాలు బయటకి పోవు. దీనివల్ల శరీరంలోనే ఆ ద్రవాలన్నీ ఉండిపోతాయి.  తద్వారా సోడియం తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా కూడా బరువు పెరగవచ్చు. 


Also read: రోజులో ఆ పని చేయడాన్ని పావుగంట తగ్గించండి చాలు - మీ ఆరోగ్యానికి మేలు
























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.