సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయింది. రోజూ చాలాసేపు వాటి మీద సమయాన్ని వెచ్చిస్తున్నారు ఉద్యోగులు, విద్యార్థులు. అయితే ఒక అధ్యయనం ప్రకారం రోజులో మీరు ఎంత సేపు సోషల్ మీడియాలో ఉంటారో, ఆ సమయంలో కేవలం పావుగంట తగ్గించినా చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  ఆ పావుగంట సమయాన్ని తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలను కొత్త పరిశోధన వివరిస్తోంది. 


జనరల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బిహేవియర్ సైన్స్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రోజువారీ వినియోగంలో సోషల్ మీడియాను చూడడం పావుగంట సేపు తగ్గించిన వారిలో రోగనిరోధక శక్తి పెరిగినట్టు తేలింది. జలుబు, ఫ్లూ, మొటిమలు వంటివి రావడం కూడా 15% తగ్గినట్టు పరిశోధనకర్తలు కనుగొన్నారు. నిరాశ, డిప్రెషన్, ఒంటరితనం వంటివి కూడా తగ్గి చుట్టుపక్కల ఉన్న జనాలతో కలిసే అవకాశాలు కూడా పెరిగేటట్టు గుర్తించారు. అంతేకాదు వారి నిద్రా నాణ్యతలో కూడా మార్పు కనిపించింది. దాదాపు 50% మెరుగుదల ఉంది. ఎవరైతే రోజులో పావుగంట సోషల్ మీడియా చూసే సమయాన్ని తగ్గించారో... వారిలో 30 శాతం డిప్రెషన్ బారిన పడే లక్షణాలు తగ్గినట్టు తేలింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకోవాలి. 


సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించుకోవడం వల్ల వారి జీవితాలు అనేక విధాలుగా మెరుగుపడతాయని చెబుతోంది అధ్యయనం. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు అనేక ప్రయోజనాలు ఉండే అవకాశం ఉన్నట్టు స్వాన్సీ యూనివర్సిటీ ఆఫ్ సైకాలజీ ప్రొఫెసర్లు వివరిస్తున్నారు.


సోషల్ మీడియా వినియోగం ఆరోగ్యం పై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని తెలుసుకోవడం కోసమే ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వినియోగం పెరగడం వల్ల శారీరక శ్రమ తగ్గి అది ఆరోగ్యం పై చాలా ప్రభావాన్ని చూపిస్తున్నట్టు తేలింది. సామాజిక మాధ్యమాలకు వ్యసనపరులైన వారిలో ఆందోళన, నిరాశ, శారీరక జబ్బులు కూడా వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రచురించిన మరో అధ్యయనం ప్రకారం కొన్ని వారాలు పాటు సోషల్ మీడియా వినియోగాన్ని 50% తగ్గించివారిలో మానసికంగా ఎంతో మార్పు వచ్చినట్టు గుర్తించారు.  కాబట్టి ఈ ఆధునిక కాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండమని ఎవరు చెప్పలేరు, కానీ ఆ మాధ్యమాలపై వెచ్చించే సమయాన్ని తగ్గించుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారు అవుతారు.  ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్.... వీటిల్లో సమయాన్ని గడుపుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 


Also read: పెరిగిపోతున్న H3N2 వైరస్ కేసులు, ఈ పది లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.