డిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇవాళ విచారించనుంది. ఈ సందర్భంగా ఈడీ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని టైట్ చేశారు. కీలకమైన నాయకురాలు విచారణకు వస్తున్న వేళ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను తప్ప వేరే వ్యక్తులను లోపలికి రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. 
మరోవైపు ఈ కేసులో కీలకంగా మారిన అరుణ్‌ పిళ్లైతో కలిపి ఎమ్మెల్సీ కవితను విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో పిళ్లై స్టేట్‌మెంట్‌ కీలకంగా భావిస్తోంది ఈడీ. అందుకే ఆయన్ని ఎదురుగా ఉంచి ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా కవితను విచారించే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 


కవితకు మద్దతుగా నిలిచేందుకు శుక్రవారం సాయంత్రం మంత్రి కేటీఆర్, హరీష్‌రావు న్యాయనిపుణులతో కలిసి హుటాహుటీన ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత కవితతో భేటీ అయ్యారు. ఈడీ విచారణపై న్యాయ నిపుణులతో పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని ఢిల్లీలో ఉన్న కవితకు చేరవేశారని.. ఈడీ విచారణను ఎదుర్కోనున్న ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇస్తుందనడంతో సందేహం లేదంటున్నారు. కానీ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంపై ఈడీ అడిగే ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలి అనేది సవాల్ గా మారుతుంది. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.


ఈడీ కస్టడీలోనే ఉన్న రామచంద్ర పిళ్లై ఆయన స్వయంగా తాను కవిత బినామీనని వాంగ్మూలం ఇచ్చారు. కానీ తన వాంగ్మూలాన్నివెనక్కి తీసుకుంటానని పిళ్లై హౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ తో సంబంధం లేకుండా ఈడీ కస్టడీలో ప్రశ్నించి అదనపు వివరాలు రాబడుతోంది. స్వయంగా కవితకు బినామీనని ఒప్పుకున్నందున ఇద్దర్నీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడీ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. పిళ్లై వాంగ్మూలంపై కవిత ఏం చెప్పనున్నారు, ఈడీ నోటీసులు ఇచ్చిన సెక్షన్లపై ఎలా స్పందించాలి, వాటి పరిధికి సంబంధించి పూర్తి వివరాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు కేటీఆర్, కవిత. రెండు రోజులపాటు కేటీఆర్ ఢిల్లీలో ఉండనున్నారని సమాచారం.


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న (మార్చి 7) అరెస్టు అయిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు కీలక ఆరోపణలు చేశారు. ఆయన ఏకంగా కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీ అని సీబీఐ స్పెషల్ కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్‌ పార్టనర్‌గా ఉన్నారని ఆరోపించారు. ఈ కుంభకోణం మొత్తంలో అక్రమంగా సంపాదించిన సొత్తు దాదాపు రూ.296 కోట్లు ఉండవచ్చని ఈడీ అంచనా వేసింది. దీంట్లో కొంత సొమ్ముతో అరుణ్‌ రామచంద్ర పిళ్లై కొన్ని ఆస్తులు కొన్నారని అభియోగించింది. 


పిళ్లైను మంగళవారం (మార్చి 7) అరెస్టు చేసిన ఈడీ అధికారులు అదే రోజు ఢిల్లీలోని స్పెషల్ కోర్టులో ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిపోర్టులో ఈ ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. సౌత్ గ్రూప్‌లో పార్టనర్స్‌గా శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహా మరికొంత మంది ఉన్నారు. దీనికి బయట ప్రతినిధులుగా పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు వ్యవహరిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.


ఇది జరిగిన రెండు రోజుల్లోనే పిళ్లైన యూ టర్న్ తీసుకున్నారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై సౌత్ లాబీలో తెలంగాణ ఎమ్మెల్సీ తరపున వ్యాపారం చేస్తున్నానంటూ ఆమె ప్రతినిధినని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని తాను వెనక్కి తీసుకుంటానని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. రామచంద్ర పిళ్లై ఇచ్చిన ట్విస్ట్‌తో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.