ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ ముందు హాజరుకానున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెతోపాటు మంత్రులు కేటీఆర్,  హరీష్‌రావుతోపాటు కీలకమైన బీఆర్‌ఎస్‌ లీడర్లు, పార్టీ లీగల్‌ సెల్‌కు చెందిన న్యాయనిపుణులు ఢిల్లీ వెళ్లారు. 


కవితను అరెస్టు చేయొచ్చు... చేసుకుంటే చేససుకోనీ... భయపడేది లేదంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల ఇప్పుడు హై టెన్షన్ పెట్టిస్తున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ కవిత పోరాటం చేసిన తర్వాత రోజే ఈడీ విచారణకు హాజరుకానున్న వేళ ఎలాంటి పరిణామాలు జరగనున్నాయనే ఆసక్తి ఉంది. ఈడీ అధికారులు అనుమతి ఇస్తే ఆమెతోపాటు న్యాయనిపుణులు ఒకరిద్దరు విచారణ సమయంలో అక్కడే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే కవితని సీబీఐ ఒకసారి విచారించింది. స్టేట్‌మెంట్‌తోపాటు కీలకమైన పత్రాలు, బ్యాంకు వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇవాళ ఈడీ విచారించనుంది. తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి మాత్రం తెలంగాణ రాజకీయాలు గమనిస్తున్న వారిలో కనిపిస్తోంది. 


ఫిళ్లై స్టేట్‌మెంట్‌తో కలకలం 


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న (మార్చి 7) అరెస్టు అయిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు కీలక ఆరోపణలు చేశారు. ఆయన ఏకంగా కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీ అని సీబీఐ స్పెషల్ కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్‌ పార్టనర్‌గా ఉన్నారని ఆరోపించారు. ఈ కుంభకోణం మొత్తంలో అక్రమంగా సంపాదించిన సొత్తు దాదాపు రూ.296 కోట్లు ఉండవచ్చని ఈడీ అంచనా వేసింది. దీంట్లో కొంత సొమ్ముతో అరుణ్‌ రామచంద్ర పిళ్లై కొన్ని ఆస్తులు కొన్నారని అభియోగించింది. 


పిళ్లైను మంగళవారం (మార్చి 7) అరెస్టు చేసిన ఈడీ అధికారులు అదే రోజు ఢిల్లీలోని స్పెషల్ కోర్టులో ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిపోర్టులో ఈ ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలక వ్యక్తిగా పేర్కొన్నారు. సౌత్ గ్రూప్‌లో పార్టనర్స్‌గా శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహా మరికొంత మంది ఉన్నారు. దీనికి బయట ప్రతినిధులుగా పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు వ్యవహరిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.


ఇది జరిగిన రెండు రోజుల్లోనే పిళ్లైన యూ టర్న్ తీసుకున్నారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై సౌత్ లాబీలో తెలంగాణ ఎమ్మెల్సీ తరపున వ్యాపారం చేస్తున్నానంటూ ఆమె ప్రతినిధినని ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని తాను వెనక్కి తీసుకుంటానని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. రామచంద్ర పిళ్లై ఇచ్చిన ట్విస్ట్‌తో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. 


రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఆప్‌నేత సిసోడియాను కస్టడీకి అడిగిన సమయంలో కూడా ఈ ఆరోపణలు రిపీట్ చేసింది ఈడీ. కవిత, సిసోడియా ఈ కేసులో కీలకమని కామెంట్ చేసింది.