H3N2 ఇన్ఫ్లూయేంజా  వైరస్... ఇది ఎంతో ప్రమాదకరమైనది చెప్పలేం, కానీ ఆరోగ్యాన్ని మాత్రం దెబ్బతీస్తుంది. మనదేశంలో ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. కర్ణాటక, హర్యానాలో రెండు మరణాలు కూడా నమోదు అయ్యాయి. దీన్ని బట్టి ఈ వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. దీర్ఘకాలంగా దగ్గు వేధిస్తుంటే తేలికగా తీసుకోకూడదు, అది H3N2 ఇన్ఫ్లూయేంజా ఏమో అని అనుమానించాలి. ఇది సోకడం వల్ల కనిపించే పది లక్షణాలు ఇలా ఉంటాయి...


1. దగ్గు 
2. ముక్కు కారడం 
3. గొంతు మంట 
4. తలనొప్పి 
5. ఒళ్ళు నొప్పులు 
6. జ్వరం 
7. చలి 
8. అలసట 
9. అతిసారం 
10. వికారం 
11. వాంతులు


వీటిలోని చాలా లక్షణాలు సాధారణ జలుబు లేదా కోవిడ్ లక్షణాలను పోలి ఉంటాయి. చాలామంది సాధారణ జలుబుగా భావించి పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ దేశంలో H3N2 ఇన్ఫ్లూయేంజా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. కాబట్టి పైన ఉన్న లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి.


చికిత్స ఎలా?
వైద్యులు ఈ వైరస్ బారిన పడిన వారికి విశ్రాంతి తీసుకోమని సూచిస్తున్నారు. ద్రవాహారాన్ని అధికంగా తీసుకుంటే ఈ వైరస్ బారి నుంచి త్వరగా బయటపడవచ్చు. అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి యాంటీబయోటిక్స్ గాని, పెయిన్ కిల్లర్లు గాని వాడకూడదు. వైద్యులు సూచించిన మందులను మాత్రమే వాడాలి. తేలికపాటి సమతుల్యమైన ఆహారం తీసుకోవడంతో పాటు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి. 


వీరు జాగ్రత్త...
కోవిడ్ లాగానే మధుమేహం, స్థూలకాయం, క్యాన్సర్ లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై H3N2 ఇన్ఫ్లూయేంజా త్వరగా దాడి చేస్తుంది. పిల్లలు, వృద్దులపై కూడా ఈ వైరస్ ప్రతాపం చూపిస్తుంది. కాబట్టి మాస్కులు ధరించడం, హ్యాండ్ శానిటైజర్లను వాడడం చాలా ముఖ్యం.


ఎలాంటి వైరస్ బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను రోజు వారీ మెనూలో చేర్చుకోవాలి. ద్రాక్ష పండు, నారింజ, నిమ్మకాయలు, ఎరుపు క్యాప్సికమ్, బ్రోకలీ, వెల్లుల్లి, అల్లం, పాలకూర, బాదం పప్పులు, పొద్దు తిరుగుడు విత్తనాలు, పసుపు పొడి, బొప్పాయి, కివి, డార్క్ చాక్లెట్. వీటిలో కనీసం అయిదు ఆహారాలైనా రోజూ తినాలి. 


విటమిన్ డి కూడా రోగనిరోధక శక్తి పెరగడానికి అత్యవసరం. దీని కోసం ఉదయం పూట సూర్యుని నుంచి వచ్చే ఎండలో పావు గంట సేపు నిల్చోవాలి. విటమిన్ డి వల్ల ఎముకలు, దంతాలు కూడా బలంగా మారుతాయి. పాలు, జున్ను, గుడ్లు, పుట్టగొడుగులు, టూనా, సాల్మన్ చేపలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. 


Also read: బీరు తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయా? ఇది ఎంతవరకు నిజం






















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.