CM KCR : తెలంగాణ వ్యాప్తంగా జనవరి 18న కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరు, ప్రజారోగ్యం వైద్యం అంశాలపై, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇతర శాఖల మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైద్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18న కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ప్రజారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ‌, ఇత‌ర మంత్రుల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశ‌ం చ‌ర్చించారు. కంటి వెలుగు పథకాన్ని 2018 ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగించారు. కంటి వెలుగు అమలు కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకంలో కంటి స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న వారికి కళ్లద్దాలతో పాటు మందులు కూడా పంపిణీ చేస్తారు. 


ఉచిత కంటి అద్దాలు


ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...‘‘ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. ముఖ్యంగా తమ కంటి చూపు కోల్పోయిన వృద్ధులకు కంటి వెలుగు పథకం ద్వారా కంటి చూపు అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి కళ్ల జోడులు అందించింది. తద్వారా వారు పొందిన ఆనందానికి అవధులు లేవు. పేదల కన్నుల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. గతంలో అందించిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి కావాల్సిన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందిస్తాం" అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన సిబ్బందిని కళ్లద్దాలు పరికరాలు తదితర అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు.






రోడ్ల పరిస్థితిపై సమీక్ష 


ప్రగతి భవన్ లో గురువారం సీఎం కేసీఆర్ రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖల మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్రం లో రోడ్ల పరిస్థితి, రోడ్లను ఎప్పటికీ చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా ఉంచేందుకు చేపట్టవలసిన చర్యలు, పాడయిన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయడం పరిపాలన సంస్కరణలో భాగంగా బాధ్యతల వికేంద్రీకరణ, పనుల నాణ్యత పెంచే దిశగా రోడ్లు భవనాలు శాఖలో చేపట్టాల్సిన నియామకాలుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, పైలట్ రోహిత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 


క్షేత్రస్థాయిలో మరింత పటిష్టంగా


తెలంగాణ రోడ్లు రవాణా ఒత్తిడి వల్ల, కాలానుగుణంగా మరమ్మత్తులు  చోటు చేసుకుంటాయని, వాటిని గుంతలు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణానికి వీలుగా నిరంతరం నిర్వహణ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.  తెలంగాణ రోడ్లు రవాణాకు సౌకర్యవంతంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పెరిగిన వనరులతో, రాష్ట్ర స్వయం ఉత్పాదక శక్తితో, అభివృద్ధి పనుల పరిమాణం రోజు రోజుకూ పెరుగుతున్నదని సీఎం అన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న గుణాత్మక ప్రగతికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కావాల్సినంత సిబ్బందిని నియమించుకుని, బాధ్యతల వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.  రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖల పరిథిల్లో క్షేత్రస్థాయిలో పనులను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టవలసిన నియామకాలు తదితర అభివృద్ధి కార్యాచరణ పై గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. 


విభిన్న పద్ధతుల్లో 


ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘  సంప్రదాయ పద్ధతిలో కాకుండా చైతన్యవంతంగా విభిన్నంగా ఇంజినీర్లు ఆలోచన చేయాలె. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, వానలకు వరదలకు పాడయిన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయాలె.  చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా రోడ్లను ఉంచేందుకు నిరంతర నిర్వహణ చేపట్టాల్సిన బాద్యత ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖలదే. ఈ దిశగా మీ శాఖల్లో   పరిపాలన సంస్కరణలు అమలు చేయాలె. క్షేత్రస్థాయిలో మరింతమంది ఇంజనీర్లను నియమించుకోవాలె..’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.