Sajjala RamaKrishna Reddy : ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన ఆయన ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలు ఉంటే ఇప్పటి వరకు ఉద్యోగ సంఘ నాయకులే  ప్రయత్నాలు  చేశారన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులను  వాడుకోవాలనే  ధోరణే అవలంభించాయన్నారు. ఉద్యోగులను సంఘంగా చేసి ఆర్గనైజ్ చెయ్యాలనే ఆలోచనలేదన్నారు. సీఎం దృష్టిలో ఉద్యోగులందరూ సమానమే అన్నారు. ఉద్యోగులకు రాజకీయాలు వద్దు అని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. పథకాల అమలులో మంచి ఫలితాలు రావాలంటే ఉద్యోగుల పాత్ర ముఖ్యమని సీఎం చెప్పారన్నారు. 


ఉద్యోగులు అభివృద్ధి భాగస్వామ్యం కావాలి 


"మాకు కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు పరిచయం కూడా లేదు. ఉద్యోగులను మా రాజకీయాలకు వాడుకోవాలని ఉద్దేశంలేదు. సమాజం మొత్తాన్ని మరింత మెరుగ్గా తీసుకు వెళ్లడమే సీఎం ఉద్దేశం. సమాజంలో అభివృద్ధి సాధించడంలో  ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తున్నాం. ఏదైనా మేము చేయలేకపోతే మా నిస్సహాయత ఉద్యోగులకు చెప్తున్నాం. మాకు ఉద్యోగుల గ్రూపులు అనవసరం. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలి అదే కోరుకుంటున్నాం. సమాజానికి సేవ చేస్తున్నామని తృప్తి కూడా ఉద్యోగుల్లో  ఉండాలి. ఉద్యోగులు అందరూ కలిసి ఉండి అభివృద్ధిలో కీలకంగా ఉండలనేదే సీఎం జగన్ అభిప్రాయం."- సజ్జల రామకృష్ణా రెడ్డి 


సమస్యలు వస్తూనే ఉంటాయ్


ఉద్యోగులతో  రాజకీయాలు  చెయ్యాలనే  ఉద్దేశ్యం  ఈ ప్రభుత్వానికి  లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల  రామకృష్ణారెడ్డి. ఉద్యోగుల  మధ్య  గ్రూపులు  ఉండాలనే  ఉద్దేశం సీఎం జగన్ కు లేదన్నారు. ఉద్యోగులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు సజ్జల. మూస విధానాల ఆలోచన ఇప్పుడు లేదని ఇందువల్ల ఉద్యోగుల చాలా సమస్యలు పరిష్కారం అయ్యిందన్నారు. సమస్యలు  వస్తూనే  ఉంటాయని, కాబట్టి   ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు. అసంఘటిత వర్గాల ఉద్యోగులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి  పెట్టిందన్నారు. 
 


ఉద్యోగులందరూ సమానమే 


"పీఆర్సీపై అప్పట్లో అలాంటి ఒత్తిడితో ఒక సైడ్ తీసుకున్నప్పటికీ అధికారంలోకి రాగానే మాకు సంబంధించిన వరకూ ఉద్యోగులు అందరూ సమానమే. ఉద్యోగులలో మా రాజకీయాలు పెట్టదలచుకోలేదు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వ పథకాలు,  సంస్కరణలు చిట్టచివరి వరకూ వెళ్లాలంటే ఉద్యోగుల పాత్ర కీలకం. అందుకే ఉద్యోగుల్లో గొడవలు పెట్టొద్దు. మనం చేయగలిగితే చేద్దాం. లేకపోతే వాళ్లతో మాట్లాడి కన్విన్స్ చేద్దాం. అంతే వాళ్లతో రాజకీయాలు వద్దు అని సీఎం జగన్ అన్నారు. ఈ విషయం సీఎం ముందు నుంచి చెబుతున్నారు."- సజ్జల 


బొప్పరాజు సలహా 


ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఓ సూచన ఇచ్చారు. ప్రభుత్వ, రాష్ట్ర వ్యవహారాలు, ఉద్యోగుల సమస్యలతో సజ్జల రామకృష్ణా రెడ్డి సతమతం అవుతున్నారన్నారు. "మీరు ఒత్తిడి తగ్గించుకోవాలి. ఉద్యోగులు మమల్ని విమర్శిస్తున్నా ప్రభుత్వం ఏదో ఒక రోజు ఉద్యోగులకు మేలు చేస్తుందని ఆశిస్తున్నాం" అన్నారు. 11వ పీఆర్సీలో మమ్మల్ని చంపి 12వ పీఆర్సీలో బతికించండని బొప్పరాజు చమత్కరించారు.