US Warns China:


గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా..


అమెరికా చైనా మధ్య వైరం, దూరం పెరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ హయాం నుంచి మొదలైన ఈ ఘర్షణ..ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. "అగ్రరాజ్యం" అనే హోదా కోసం ప్రయత్నిస్తున్న చైనా...అమెరికాను పదేపదే ఇబ్బందులకు గురి చేస్తోంది. కేవలం అమెరికాతోనే కాదు. పొరుగు దేశాలన్నింటితోనూ చైనా ఇలా కయ్యం పెట్టుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు తైవాన్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. తైవాన్ విషయంలో ఏ దేశమైనా సరే జోక్యం చేసుకోకూడదని తేల్చి చెప్పారు జిన్‌పింగ్. ఆ మధ్య అమెరికా స్పీకర్‌ నాన్సీ తైవాన్ పర్యటనకు వెళ్లిన సయంలో ఆ దేశంపై క్షిపణి దాడులనూ చేసింది చైనా. "అమెరికా జోక్యం చేసుకోవాల్సిన పని లేదు" అని పరోక్షంగా హెచ్చరికలు చేసింది. ఈ దాడుల తరవాత అమెరికా కూడా చైనాపై సీరియస్ అయింది. తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు ఎంతకైనా తెగిస్తానని జిన్‌పింగ్ చేసిన ప్రకటనపై మండి పడుతోంది. చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా మిలిటరీకి చెందిన ఓ ఉన్నతాధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


"తైవాన్‌పై దాడి చేస్తే..అది కచ్చితంగా చైనా వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది" అని అన్నారు. తైవాన్‌ను ఆక్రమించుకోవటం అంత సులభం కాదని తేల్చి చెప్పారు. "తైవాన్‌లోకి చొచ్చుకెళ్లడం అంత సులువు కాదు. ఎన్నో  పర్వత శ్రేణులున్న ద్వీపమది. మిలిటరీని పంపి దాడులు చేయడం కష్టం" అని వెల్లడించారు. ప్రస్తుతం పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి ఏ తప్పైతే చేశారో...తైవాన్‌పై దాడి మొదలు పెడితే చైనా కూడా అలాంటి తప్పు చేసినట్టే అవుతుంది అంటోంది అమెరికా. ఉక్రెయిన్ యుద్దం నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచిస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ ఎలాగైతే ఆత్మరక్షణ కోసం గట్టి పోరాటం చేస్తోందో...తైవాన్ కూడా ఏదో ఓ రోజు చైనాను గట్టిగా ఢీకొడుతుందని అంచనా వేస్తున్నారు. "ఆధిపత్యం" చెలాయించాలన్న ఆకాంక్ష చైనాను ఎలాంటి పనులైనా చేయిస్తుందని వివరించారు. అమెరికా సైన్యం ప్రపంచంలోనే నంబర్ వన్ అని అంటోంది. 


పోలాండ్‌లోనూ అలజడి..


రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పొరుగు దేశాలు కూడా టెన్షన్ పడుతున్నాయి. ముఖ్యంగా..పోలాండ్‌లోనూ ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. చాన్నాళ్ల నుంచి ఉక్రెయిన్ పౌరులు అంతా పోలాండ్‌కు వలస వెళ్తున్నారు. ఉక్రెయిన్ శరణార్థులకు అండగా ఉంటామని పోలాండ్ కూడా గతంలో ప్రకటించింది. ఈ ప్రకటనతో రష్యా తీవ్రంగా మండి పడింది. అప్పటి నుంచి పోలాండ్‌ను కూడా టార్గెట్‌ చేసుకుంది. నేరుగా తలపడక పోయినా...అక్కడ అలజడి సృష్టించే విధంగా వ్యవహరిస్తోంది. నాటో సభ్య దేశమైన పోలాండ్‌పై రష్యా మిసైల్ దాడులు జరిపింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో పోలాండ్ ఆర్మీ అప్రమత్తమైంది. కానీ...రష్యా మాత్రం ఈ దాడి తాము చేయలేదని ఖండిస్తోంది. పోలాండ్ మీడియా కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని మండి పడింది. ఈ దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాలిలో G-7,NATO ఆత్యయిక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ..రష్యాపై ఆరోపణలు చేశారు. యుద్ధ వాతావరణాన్ని మరింత సంక్లిష్టం చేసేందుకే రష్యా ఇలాంటి దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. 


Also Read: Russia-Ukraine War: ఎవ్వర్నీ వదలం, అందరి లెక్కలూ తేల్చేస్తాం - రష్యాపై జెలెన్‌స్కీ ఆగ్రహం