టీ20 ప్రపంచ కప్ 2022 సెమీఫైనల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత టీ20 ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్సీలో మార్పు చేయాలని డిమాండ్ పెరిగింది. క్రికెట్ పండితులు, అభిమానులు రోహిత్ నిర్ణయాలను, అతని నాయకత్వ నైపుణ్యాలను విమర్శించారు. ఈ సీనియర్ ఓపెనర్ ఫాం కూడా ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. తదుపరి T20 ప్రపంచ కప్‌కు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది కాబట్టి భారత కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండాలని చాలా మంది అభిప్రాయపడ్డారు.
ఈ చర్చపై మాజీ భారత ఆల్-రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. జట్టులో ఎక్కువ మంది నాయకులు ఉండటం గురించి మాట్లాడాడు. హార్దిక్‌ను కొత్త కెప్టెన్‌గా చేయడం వెనుక ఉన్న పెద్ద ప్రమాదాన్ని కూడా తెలిపాడు. "కెప్టెన్‌ని మార్చినట్లయితే ఫలితం మారుతుందని నేను అనుకోవడం లేదు. కానీ మీరు అలా వెళితే ఫలితాన్ని మార్చలేరు అని కూడా నేను చెప్పడం లేదు. హార్దిక్ పాండ్యా ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అని మనమందరం అర్థం చేసుకోవాలి. అతనికి గాయం సమస్యలు కూడా ఉన్నాయి. ప్రపంచ కప్‌కు ముందు అతను గాయపడితే ఎలా ఉంటుంది? మరే ఇతర నాయకుడు కెప్టెన్సీ చేయడానికి సిద్ధంగా లేకుంటే జట్టు అయోమయంలో పడుతుంది." అని పఠాన్ అన్నాడు.
"నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నదేమిటంటే, గుజరాత్ టైటాన్స్‌ను ఐపీఎల్ గెలిచిన హార్దిక్ పాండ్యా కచ్చితంగా ఒక నాయకుడే. కానీ మీరు ఒకరిని కాదు ఇద్దరు నాయకులను వెతకాలి. మనకు కచ్చితంగా నాయకుల సమూహం కూడా ఉండాలి.” అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. నవంబర్ 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే వైట్ బాల్ సిరీస్‌లో న్యూజిలాండ్‌ను భారత జట్టు ఢీకొట్టనుంది. ఈ సిరీస్‌లో రెండు జట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి.
భారత టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్
భారత వన్డే జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సుందర్, వషింగ్‌తోన్ సుందర్, , కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్