Hardik Pandya to Micheal Vaughan:  టీమిండియాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ చేసిన విమర్శలపై హార్దిక్ పాండ్య స్పందించాడు. ఇతరుల అభిప్రాయాలను తాము ఎప్పుడూ గౌరవిస్తామని చెప్పాడు. అయితే భారత జట్టుకు ఇప్పుడు కొత్తగా రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించాడు.


'ఇది ఒక క్రీడ. ప్రతిసారి మరింత బాగా ఆడగలిగేలా ప్రయత్నించాలి. ఫలితం దానంతటదే వస్తుంది. ప్రపంచకప్ ఫలితం నిరాశపరిచింది. మా పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తాం. మేం ప్రొఫెషనల్ ఆటగాళ్లం. జయాపజయాలను ఒకేలా స్వీకరిస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుంది' అని పాండ్య వివరించాడు. 
'మన ప్రదర్శన బాగా లేనప్పుడు ఎవరి అభిప్రాయాలు వారు చెప్తుంటారు. అందులో తప్పేంలేదు. వాటిని మేం గౌరవిస్తాం. అయితే అంతర్జాతీయంగా పేరున్న టీమిండియా ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు.' అంటూ పాండ్య వాన్ కు కౌంటర్ ఇచ్చాడు. 


వాన్ విమర్శలివీ


టీ20 ప్రపంచకప్ లో భారత్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ వాన్ టీమిండియాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ‘వైట్‌బాల్‌ చరిత్రలోనే అత్యంత పేలవమైన జట్టుగా టీమ్‌ఇండియా నిలిచింది. వాళ్లకున్న ప్రతిభకు టీ20 క్రికెట్‌ ఎలా ఆడగలరని నేను ఆశ్చర్యపోయాను. వారి దగ్గర గొప్పగా ఆడేవారున్నారు. కానీ జట్టు కూర్పు సరిగా లేదు. లేదంటే పవర్‌ప్లే మొదటి 5 ఓవర్లలోనే ఇంగ్లిష్‌ ఆటగాళ్లను స్థిరపడనిచ్చేవారా? ఆ విషయంపై టీమ్‌ఇండియా దృష్టి పెట్టాల్సిందే’ అంటూ మైఖేల్‌ ఇటీవల ఓ మీడియా కథనంలో పేర్కొన్నాడు. 


వన్డే ప్రపంచకప్ కూడా ఇంగ్లండ్ దే


వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ను ఇంగ్లండ్ గెలుచుకుంటుందని వాన్ అన్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. సొంత గడ్డపై పరిస్థితులను ఉపయోగించుకుని టీమిండియా విజేతగా నిలుస్తుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. దీనిపైన వాన్ స్పందిస్తూ.. పొట్టి కప్పులో ఇంగ్లండ్ చేసిన అద్భుతం చూశాక కూడా భారత్ గెలుస్తుందనడం అవివేకం అంటూ వ్యాఖ్యలు చేశాడు. 'వన్డే ప్రపంచకప్ ను ఇంగ్లండే గెలుచుకుంటుంది. పరిస్థితులను ఉపయోగించుకుని భారత్ విజయం సాధిస్తుందన్నది ఒట్టిమాట. ఇంగ్లిష్ జట్టుకే విజయావకాశాలు ఉన్నాయి. మరికొన్నాళ్లపాటు ఇవే పరిస్థితులు ఉంటాయి.' అని వాన్ అన్నాడు.