Laxman's mantra for India: టీ20 ఫార్మాట్లో టీమ్‌ఇండియా దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉందని ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. అదే సమయంలో వికెట్ స్వభావం, పిచ్ కండిషన్స్‌ను పట్టించుకోవాల్సి ఉంటుందన్నాడు. ఆటగాళ్లు తమ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సూచించాడు. హార్దిక్ పాండ్య నాయకుడిగా రాణిస్తాడని అంచనా వేశాడు. దూకుడు మంత్రానికి సరిపోయే కుర్రాళ్లు జట్టులో ఉన్నారని వెల్లడించాడు. న్యూజిలాండ్ సిరీసులో రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
అగ్రెసివ్ ముఖ్యమే
'అవును, టీ20 క్రికెట్లో దూకుడుగా ఉండటం ముఖ్యమే. ఇందుకు తగ్గట్టే తమను తాము ఎక్స్‌ప్రెస్ చేసుకొనే కుర్రాళ్లు జట్టులో ఉన్నారు. కెప్టెన్‌గా హార్దిక్, కోచ్‌గా నేనూ ఇదే సందేశాన్ని ఇస్తున్నాం. అగ్రెసివ్‌గా ఆడండి. అదే సమయంలో కండిషన్స్, సిచ్యువేషన్లపై ఫోకస్ చేయాలి. అనుభవాన్ని ఉపయోగించుకోవాలి' అని లక్ష్మణ్ అన్నాడు.
కుర్రాళ్లు ఉన్నారు
'ఈ సిరీసులో మా రెగ్యులర్ టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లేరు. ఇప్పుడు ఎంపిక చేసిన ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం ఉంది. ప్రత్యేకించి టీ20 క్రికెట్ బాగా ఆడతారు' అని వీవీఎస్ తెలిపాడు. పొట్టి ఫార్మాట్లో రాణించాలంటే స్పెషలిస్టుల అవసరం ఉందన్నాడు. 'ఎడతెరపి లేకుండా విపరీతంగా క్రికెట్ ఆడుతున్నారన్నది నిజం. ఎంపిక చేసుకొనేందుకు ఎక్కువ మంది కుర్రాళ్లు ఉండటం అదృష్టం. కొందరు క్రికెటర్లకు విరామాలు ఇవ్వడం జట్టు యాజమాన్యం, సెలక్షన్ కమిటీ సభ్యుడిగా దృష్టిలో పెట్టుకోవాలి. శారీరకంగానే కాదు మానసికంగానూ పునరుత్తేజం పొందేందుకు విరామాలు ఉపయోగపడతాయి' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
రిజర్వ్ బెంచ్ సూపర్
'టీమ్‌ఇండియాకు చక్కని రిజర్వ్ బెంచ్. తెల్లబంతి క్రికెట్లో ముందుకెళ్లాలంటే స్పెషలిస్టు ప్లేయర్లు అవసరం. టీ20 క్రికెట్లో ఎక్కువమంది స్పెషలిస్టులు కనిపిస్తారు. వారి పనిభారం పర్యవేక్షించడం కీలకం. హార్దిక్ పాండ్య అద్భుతమైన నాయకుడు. గుజరాత్ టైటాన్స్‌ను ఎలా గెలిపించాడో మనమంతా చూశాం. అదేం చిన్న ఘనత కాదు. ఐర్లాండ్ సిరీసులో అతడితో సమయం గడిపాను. వ్యూహాత్మకంగా ఉండటమే కాకుండా ప్రశాంతంగా ఉంటున్నాడు. ఒత్తిడి పరిస్థితుల్లో ఇలా ఉండటమే మంచిది. ఆటగాళ్లందరికీ అతడిపై నమ్మకం ఉంది. వారితో సరదాగా ఉంటాడు. శుభ్‌మన్ గిల్ తెలివైన ఆటగాడు. అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. మెల్లగా అతడు నిలకడైన క్రికెటర్, మ్యాచ్ విన్నర్‌గా మారుతున్నాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది' అని వీవీఎస్ తెలిపాడు.
y