KCR National Party : తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు. అంతకు ముందు టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పాటు జెడ్పీ ఛైర్మన్లు పాల్గొనున్నారు. అయితే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నేతలను ఆహ్వానించారు. దీంతో ఇతర రాష్ట్రాల నేతలు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ఆధ్వర్యంలో జరిగే రేపటి జనరల్ బాడీ సమావేశానికి హాజరయ్యేందుకు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, జేడీఎస్ నేత రేవన్న, పలువురు జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు హైదరాబాద్ చేరుకున్నారు. జేడీఎస్ ప్రతినిధి బృందానికి బేగంపేట ఎయిర్ పోర్టులో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చీఫ్ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ స్వాగతం పలికారు. రేపు తెలంగాణ భవన్ లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి కుమారస్వామి బృందం హాజరుకానున్నది.
జాతీయ పార్టీ ప్రకటన
టీఆర్ఎస్ పార్టీలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ రేపు జాతీయ పార్టీగా మారనుంది. విజయదశమి రోజున మధ్యాహ్నం 1.19 నిమిషాలకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సహా ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. తమిళనాడులో దళిత ఉద్యమ పార్టీగా పేరున్న విడుదలై చిరుత్తయిగల్ కచ్చి పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్యే బాల్కా సుమన్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. మరో మూడు పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కొన్ని పార్టీలు బీఆర్ఎస్ లో విలీనమవుతాయని నేతలు అంటున్నారు. జాతీయ పార్టీ ప్రకటన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
Also Read : Munugode: మునుగోడు కోసం TRS పక్కా స్కెచ్, దసరా తర్వాత నుంచి రంగంలోకి - అభ్యర్థి ప్రకటన ఎప్పుడంటే
Also Read : BRS AP Chief : ఏపీ బీఆర్ఎస్ చీఫ్‌ను ఖరారు చేసుకున్న కేసీఆర్ - అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తోందా ?