హుజురాబాద్ పోలింగ్ ముగిసింది. గెలుపెవరిదినే దానిపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. కానీ ఫలితం మాత్రం తెలంగాణ రాజకీయాల్ని మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు గెలిస్తే వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉదంి. ఓడిన వారికి ప్రతికూలత వస్తుందని భావిస్తున్నారు. అందుకే అన్ని పార్టీలు హుజురాబాద్ ఉపఎన్నికలను ఓ ప్రయోగంగా మార్చి పోటీ పడ్డాయి. ఫలితం ఎలా వచ్చినా ఓ భిన్నమైన రాజకీయ వాతావరణం తెలంగాణలో ఏర్పడటం ఖాయమని చెప్పుకోవచ్చు. 




ఈటలకు ప్రతిష్టాత్మకం - బీజేపీకి ప్రాణసంకటం !


దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు.. గ్రేటర్‌లో ఒక్క సారిగా ఎదిగిపోవడంతో బీజేపీకి వచ్చిన ఊపు  తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ , మినీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయంతో పూర్తిగా చప్పబడిపోయింది.  ఇప్పుడు బీజేపీకి మరో చాన్స్ వచ్చింది. అదే హుజూరాబాద్ ఉపఎన్నిక. స్వయంగా కేసీఆరే.. ఈ చాన్స్ ఇచ్చారు. హుజూరాబాద్‌లో బీజేపీకి ఎప్పుడూ బలం లేదు. గత ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 1600 ఓట్లు మాత్రమే వచ్చాయి.  కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పాతుకుపోయిన ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ పడ్డారు. కాబట్టి... బీజేపీ హాట్ ఫేవరేట్‌గా బరిలో ఉంది. ఇక్కడ ఈటల ఓడిపోతే... ఈటలకు ఎంత నష్టం జరుగుతుందో.. బీజేపీకి అంత కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే  బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈటల రాజేందర్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసినట్లయితే అన్ని వర్గాల మద్దతు లభించేదని ఇప్పటికే కొంత మంది విశ్లేషణలు చేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరడం వల్ల చాలా మంది మద్దతును కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు. అంటే.. ఒక వేళ ఈటల కనుక ఓడిపోతే.. ఆ ఓటమి ఈటలది కాదని.. బీజేపీదనే ప్రచారం చేస్తారు. ఇది మరింత డ్యామేజ్ చేస్తుంది. పడిపోయిన హైప్‌ను మళ్లీ పెంచుకోవాలన్నా బీజేపీ వల్లనే ఈటల గెలిచారన్న పేరు రావాలన్నా ఖచ్చితంగా హుజూరాబాద్‌లో బీజేపీ గెలవాల్సి ఉంది. ప్రత్యేకంగా కేసీఆర్ కోరుకుంటే తప్ప.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు. మళ్లీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇతర ఏ ఎన్నికలు కూడా లేవు. బీజేపీ పుంజుకుంది అని నిరూపించుకోవడానికి గొప్ప అవకాశం. ఓడిపోతే మాత్రం బీజేపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయి.


Also Read : డబ్బుల కోసం ఓటర్ల ధర్నాలు ! ప్రజాస్వామ్యం పతనావస్థకు ఇదే సంకేతమా ?


టీఆర్ఎస్‌కు లిట్మస్ టెస్ట్... కేసీఆర్‌కు తాడో పేడో ఎన్నిక ! 
 
హుజూరాబాద్ ఉపఎన్నిక స్వయంగా కేసీఆర్ తెచ్చుకున్నదే.  ఈటల రాజేందర్‌ను ఎందుకు అంత త్వరగా వదిలించుకోవాలనుకున్నారో కానీ ఉపఎన్నిక వచ్చేసిది. అందుకే  మిగతా ఉపఎన్నికల కన్నా హుజూరాబాద్ ప్రత్యేకమైనది. హుజురాబాద్ లో విజయంతో 2023 ఎన్నికల కు వెళ్లాలని బీజేపీ పట్టుదలగా ఉంది. బెంగాల్ తరహా పోరాటం చేస్తామని బీజేపీ చెబుతోంది. తమ తర్వాతి టార్గెట్ తెలంగాణే నని ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నాయకులు ప్రకటించారు.  దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం.. గ్రేటర్ ఎన్నికల్లో మమంచి ఫలితాలు బీజేపీ కి బూస్ట్ నిచ్చాయి. అయితే ఆ తర్వాత జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ సత్తా చాటింది. ఆ ఫలితాలు బీజేపీని తీవ్రంగా నిరాశ పరిచాయి. మళ్ళీ దూకుడు పెంచడానికి సమయం కోసం ఆ పార్టీ ఎదురు చూస్తోంది. అయితే తిరిగి పుంజుకోవడానికి హుజురాబాద్ ఉప ఎన్నిక అందివచ్చిన అవకాశంగా కమలదళం భావిస్తోంది. దుబ్బాకలో గెలిచిన తర్వాత బీజేపీ నేతల దూకుడుకు టీఆర్ఎస్ నేతలు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇప్పుడు హుజురాబాద్ లో గెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా టీఆర్ఎస్ అధినేతకు అంచనా ఉంది. అందుకే అక్కడ బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లో గెలిచే అవకాశం ఇవ్వకూడదని పట్టుదలతో ఉన్నారు. అందుకే దళిత బంధు సహా అనేక కీలకమైన పథకాలు చేపట్టారు. హరీష్ రావుకు బాధ్యతలు ఇచ్చారు. ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదు. ఒక వేళ ఎన్నికల్లో ఫలితం తేడా వస్తే బీజేపీ నుంచి మరింతసెగ ఎదుర్కోవాల్సి ఉంటుంది. గెలిస్తే మటుకు మళ్లీ ముందస్తు ఎన్నికలకు సమర శంఖారావం పూరించవచ్చు.


Also Read : మంగళవారం మరదలమ్మా వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ... పశ్చాత్తాపం వ్యక్తం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..


రేవంత్ కు లిట్మస్ టెస్ట్ !


తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి..ఆ పదవిని పొందడానికి సొంత పార్టీలోని పోటీ దారుల నుంచే కాదు.. ఇతర పార్టీలు వేసిన పాచికలను కూడా.. సమర్థవంతంగా అధిగమించాల్సి వచ్చింది. ఇప్పుడు  అంతకంటే ఎక్కువ రాజకీయ నైపుణ్యతను చూపించి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించాల్సిన పరిస్థితి హుజురాబాద్ ఉపఎన్నికతో వచ్చింది. తెలంగాణలో కేసీఆర్‌ను భయపడకుండా ఢీకొట్టే ఒకే ఒక్కరాజకీయ నేతగా రేవంత్ రెడ్డికి పేరు ఉంది. అది ఆయనను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయగానే కాంగ్రెస్‌ పార్టీకి పాజిటివ్ వేవ్ తీసుకు వచ్చింది. ఓ ఊపు వచ్చింది. రాజకీయాలపై సాధారణ ఆసక్తి ఉన్న ప్రజల్లోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఇన్నాళ్లకు ఓ మంచి నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమయింది.  అంటే రేవంత్ రెడ్డిపై... చాలా మంది ఎన్నో అంచనాలు పెట్టుకున్నారన్నమాటే.  ఇప్పుడు రేవంత్ రెడ్డి పై బాధ్యత చాలా ఎక్కువగా ఉన్నట్లే. ఆయన ముందు ఉన్న మొదటి సవాల్ హుజూరాబాద్ ఉపఎన్నిక.  హుజురాబాద్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న పోరు సాగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి చాలా కాలం అయింది. మొదట్లో టీడీపీ గెలిచేది.. ఆ తర్వాత టీఆర్ఎస్ కంచుకోట అయింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అక్కడ గొప్ప ట్రాక్ రికార్డు లేదు. అలాంటి చోట.. కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోయినా కనీసం గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితికి తీసుకెళ్లగలిగితేనే రేవంత్ రెడ్డి మొదటి అడుగులో తనదైన విజయం సాధించినట్లుగా భావిస్తారు. లేకపోతే ఇబ్బంది పడటం ఖాయం. 


Also Read : హుజురాబాద్‌లో రికార్డు స్థాయి పోలింగ్.. చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతం !


హుజురాబాద్ ఫలితంతో తెలంగాణలో సమూల మార్పులు !


ఎలా చూసినా ఈసారి హుజురాబాద్ ఓటర్లు తెలంగాణ రాజకీయాల్ని మార్చేయబోతున్నారనడంలో సందేహం లేదు. ఫలితం ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం వారిచ్చే ఫలితం ఆధారంగా అనేక మంది నేతల  భవిష్యత్ ఆధారపడి ఉంది. ్ందుకే హుజురాబాద్ ఇప్పుడు అందరికీ హాట్ ఫేవరేట్ ! 


Also Read : అనుమతులు వచ్చాకే పాలమూరు - రంగారెడ్డి నిర్మాణం .. తెలంగాణ సర్కార్‌ను ఆదేశించిన ఎన్జీటీ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి