'ప్రేమంటే ఇదేరా' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన తనీష్.. ఆ తరువాత 'దేవుళ్లు', 'మన్మథుడు' ఇలా పలు సినిమాల్లో నటించాడు. 2008లో 'నచ్చావులే' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలో ఒకట్రెండు విజయాలు అందుకున్నప్పటికీ ఆ తరువాత మాత్రం డీలా పడ్డాడు. ప్రతీ ఏడాది ఏదొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. అతడికి నిరాశే ఎదురైంది. 

 


 

బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అగ్రెసివ్ గేమ్ తో ఆకట్టుకున్నాడు. చివరి వరకు హౌస్ లో ఉండి సెకండ్ రన్నరప్ గా నిలిచాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మళ్లీ హీరోగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మధ్యనే 'మా' ఎలెక్షన్స్ లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున పాల్గొని ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గెలిచాడు. ఈ క్రమంలో అతడు మోహన్ బాబుపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. తనీష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై.. 23 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. 

 

''ప్రేమంటే ఇదేరా!


ఈ సినిమా వచ్చి, నేను నటన ప్రారంభించి ఈ రోజుకి 23 ఏళ్లు. నాకున్న 30 ఏళ్లలో నేను గుర్తుపెట్టుకున్న, నాకు గుర్తున్న 23 ఏళ్లు. ఈ 23 ఏళ్లలో నా సినిమా ప్రయాణం గురించి తప్పితే పరిణామాల గురించి ఏనాడూ ఆలోచించలేదు.

తెలియకుండా అమ్మ నాన్న ఇష్టంతో మొదలైన ఈ ప్రయాణం నాకు అర్ధమవ్వటం మొదలైనప్పటినుంచి సినిమాలనే ప్రేమించాను.. ఇదే నా ప్రపంచం అని ఫిక్సయిపోయాను. ఎప్పటికీ నేను సినిమావాడిని అని గర్వంగా చెప్పుకుంటాను.

ఒడిదుడుకులు అన్ని చోట్ల ఉంటాయి.. పోరాడి చివరికి నిలబడే వాడే కాదు, చివరివరకు నిలబడాలి అని తన తుది శ్వాస వరకు పోరాడేవాడు కూడా యోధుడే! పోరాడటం ముఖ్యం అనేది నా ఆలోచన. నిజం చెప్పాలంటే ఫైట్ చేసే టైంలో ఉండే ఎక్సయిట్మెంట్ గెలిచామా/ ఓడామా అనే రిజల్ట్ తెలిసిన టైంలో ఉండదు. నా వరకు రిజల్ట్ అనేది సెకండరీ.. నేను ఇప్పటికీ ఫైట్ లోనే ఉన్నా.. అదే నాకు ఎనర్జీని ఇస్తుంటుంది. 

కొంతమంది జనాలకు నేను నచ్చను.. మరికొంతమంది నన్ను ట్రోల్ చేస్తూ.. ఇప్పటికీ నటిస్తున్నారా..? అని ప్రశ్నిస్తుంటారు. వారందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. 'మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు క్షమించండి.. కానీ నాకు తెలిసిన పని ఇదొక్కటే.. నా చివరిశ్వాస వరకు ఈ పని చేస్తూనే ఉంటా'

 

Last but not least..

 

కృష్ణానగర్ లో ఉన్న నా సినిమా కుటుంబం నుంచి ఇప్పటిదాకా నన్ను .. నా నటనని ఆశీర్వదించిన, ఆశీర్వదిస్తున్న , ఆదరిస్తునన్న ప్రతి ఒకరికి పేరు పేరునా.. నా కృతజ్ఞతలు.

ఈ జర్నీలో నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా నన్ను నమ్మి నాతో వర్క్ చేసిన నా దర్శక నిర్మాతలకు. 

అమ్మ , నాన్న రుణమెలా.. తీర్చుకోలేనిదో మీ అందరి ఋణం కూడా అలాగే తీర్చుకోలేనిది.


కానీ ఒక్క మాటివ్వగలను ..


ఊపిరి ఉన్నంత వరకు అమ్మనాన్న కల ఐన నా కళతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.
( గెలిచినా / ఓడినా )

ఇట్లు మీ

తనీష్ అల్లాడి'' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. 

 





 


Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి