Stone pelted at YS Jagan in Vijayawada- విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పై జరిగిన రాళ్లదాడిని వైసీపీ నేతలతో పాటు తెలంగాణకు చెందిన నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర (YS Jagan Bus Yatra) నిర్వహిస్తుండగా.. సింగ్‌నగర్‌ వద్దకు రాగానే ఓ ఆగంతకుడు రాయి విసరగా ఎడమ కంటి మీద గాయమైంది. ఆగంతకుడి రాయి దాడిలో గాయపడిన ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ బీఆర్ఎస్ నేతలు నైతిక మద్దతు తెలుపుతున్నారు. 


టేక్ కేర్ జగన్ అన్న.. కేటీఆర్
విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడిని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మీరు సేఫ్ గా ఉన్నందుకు సంతోషంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి జగన్ అన్న అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు, హింసకు తావు లేదన్నారు. ఇలాంటి ఘటనలు నివారించడానికి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని తన పోస్టులో కేటీఆర్ కోరారు.






జగన్ పై దాడిని ఖండించిన హరీష్ రావు 
ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడిని తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం జగన్ పై రాయి దాడి హేయమైన చర్య అని, ప్రజాస్వామ్యంలో హింసవు తావు లేదన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 


 



ప్రధాని మోదీ రియాక్షన్..
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. జగన్ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.



అసలేం జరిగింది.. 


విజయవాడలో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. గజమాల పూల మాటున వచ్చిన రాయి నేరుగా జగన్ కంటి పైన తగలింది. రాయి గట్టిగా తగలడంతో జగన్ ఎడమ కంటిపైన గాయమైంది. పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమ్తతమై సీఎం జగన్ ను ప్రొటెక్ట్ చేశారు. వెంటనే బస్సులోపలికి తీసుకువెళ్లి జగన్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. కొద్దిసేపటి తరువాత సీఎం జగన్ రోడ్ షో కొనసాగించారు. అయితే ఎవరు దాడి చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై రాళ్ల దాడిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. రాజకీయ విభేదాలు హింసాత్మకంగా మారకూడదని, మనం ప్రజాస్వామ్య ప్రక్రియలో పరస్పర గౌరవాన్ని కాపాడుకుందాం అన్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని స్టాలిన్ ఆకాంక్షించారు.