Dalit Bandhu Scheme: చేవెళ్ల: మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR). తాము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధును ఇవ్వకుంటే లబ్ధిదారులను తీసుకొచ్చి, సెక్రటేరియట్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Government) మెడలు వంచి ఆ నిధులు విడుదల చేపిస్తా అన్నారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఐక్యరాజ్యసమితి కొనియాడిందన్నారు. ఇతర రాష్ట్రాలు సైతం తాము తీసుకొచ్చిన పథకాలను వారి రాష్ట్రాల్లో అమలు చేయాలని, ఇక్కడికి వచ్చి పరిశీలించి అభినందించాయని కేసీఆర్ పేర్కొన్నారు. 


దళిత బంధు ఇవ్వపోతే పోరాటమేనన్న కేసీఆర్ 
కాంగ్రెస్ పార్టీ దళితులకు 12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, ఒక్కరికి కూడా ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు కనీసం 10 లక్షలు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల్ని మోసం చేసిందంటూ కేసీఆర్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ప్రొసిడింగ్ అయిన 1 లక్ష 30 వేల మందికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి దళితబంధు నగదు ఇవ్వకపోతే లబ్ధిదారులను తీసుకువచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ హెచ్చరించారు.


తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త
ఉచిత కరెంట్, రైతు బంధు ఇవ్వకున్నా, రైతులకు బోనస్ ఇవ్వకున్నా మాకే ఓటేస్తారు అని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఓటు వేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. లేకపోతే ఏం చేయకున్నా మమ్మల్ని ఎవరు ఏం అనరు అనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం మీకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి, అందుకే మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. 


పౌరుషం ఉంటే కాసాని జ్ఞానేశ్వర్‌ని గెలిపించండి 
మీ బీసీలకు దమ్ముంటే, బీసీలకు పౌరుషం ఉంటే కాసాని జ్ఞానేశ్వర్‌ని గెలిపించండి అని కాంగ్రెస్ నేత అన్నారు. అందుకే ఇక్కడున్న బలహీనవర్గాల మేధావులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు  కాసానిని గెలిపించాలని కేసీఆర్ కోరారు. గెలుపు, బీసీల అభివృద్ధికి మలుపు కాబట్టి కాసానిని గెలిపించి చూపించాలన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రయోజనాల కోసం అని, ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. తాను బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల కోసం పోరాడతామన్నారు. 10 ఏళ్లు అధికారం ఇస్తే అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం, కానీ నేడు అన్నీ నా కళ్ల ముందే పోతుంటే చూడలేక చాలా బాధ కలుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి తెలంగాణ సాధించినం, అవసరమైతే మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాసానిని గెలిపిస్తే ఎంపీగా చేవెళ్ల ప్రజల పక్షాన పోరాడి నిధులు తెస్తారని ధీమా వ్యక్తం చేశారు.