Ram Charan Comments After Received Doctorate: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ తాజాగా గౌరవ డాక్టరేట్‌ అందుకున్నాడు. ఈ రోజు చెన్నైలో వేల్స్‌ యూనివర్సిటీలో జరిగిన 14వ వార్సికోత్సవ వేడుకల్లో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ అందించింది. సినీరంగంలో, ఎంటర్‌ప్రెన్యూరర్‌గా ఆయన అందించిన సేవలకు గాను లిటరేచర్‌లో డాక్టరేట్‌ను ప్రదానం చేసింది వేల్స్‌. ఈ సందర్భంగా చరణ్‌ మాట్లాడుతూ తన అద్భుతమైన స్పిచ్‌తో ఆకట్టుకున్నాడు. "నాపై ప్రేమాభిమానాలు చూపించి గౌరవంతో నాకు డాక్టరేట్‌ అందించిన వేల్స్‌ యూనివర్సిటీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 38 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న వేల్స్‌ యూనివర్సిటీ నుంచి నాకు ఇంతటి అరుదైన గౌరవం దక్కడం చెప్పలేనంతం ఆనందంగా ఉంది. నిజానికి నాకు ద‌క్కిన ఈ గౌర‌వం నాది కాదు.


ఇది నా ఒక్కడి ఘనత కాదు


ఇది నా అభిమానుల‌ది, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, నా తోటి న‌టీన‌టుల‌ది. ముందు వేల్స్‌ యూనివర్సిటీ నాకు గౌరవ డాక్టరేట్‌ ఇస్తున్నారనే విషయం తెలియగానే మా అమ్మ(సురేఖ) నమ్మలేదు. ఆర్మీలాంటి గ్రాడ్యుయేష‌న్స్ మ‌ధ్య‌ నేనూ ఈ రోజు ఇలా డాక్టరేట్‌ అందుకున్నానని తలచుకుంటుంటేనే ఎంతో సంతోషంగా ఉంది. వేల్స్‌ యూనివర్సిటీని 38 ఏళ్లుగా సక్సెస్‌ ఫుల్‌ రన్‌ చేస్తున్న  ఇక్కడ 45వేలకు పైగా మంది స్టూడెంట్స్‌ ఉన్నారు. ఎంతోమంది ఇక్కడ చదివి సైంటిస్టులుగా ఎదిగారు. ఎంతోమందిని గొప్పవారిగా తీర్చిదిద్దుతూ ఇంత విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళుతున్న వేల్స్‌ యాజమాన్యానికి, టీచింగ్‌ సిబ్బంది, విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు. 


నేను చెన్నైలోనే పుట్టాను


అనంతరం చరణ్‌ మాట్లాడుతూ.. చెన్నై నాకేంతో ఇచ్చింది. నేను పుట్టింది ఇక్కడే. ఇక్కడి విజయ హాస్పిటల్‌లోనే నేను పుట్టాను. ఇక మా నాన్నగారు మెగాస్టార్‌ చిరంజీవి సినీ ప్రయాణం కూడా ఇక్కడి నుంచే మొదలైంది. నా భార్య ఉపాసన వాళ్ల అపోలో హాస్పిటల్స్‌ కూడా ఇక్కడే ప్రారంభం అయ్యాయి. ఇక తెలుగు ఇండస్ట్రీలోని 80 శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది. ఏదో సాధించాలని చెన్నైకి వచ్చిన వారి ప్రతి ఒక్కరి కల నేరవేరుతుంది. ఈ ప్రాంతం గొప్పతనం అలాంటిది" అని అన్నారు. ఇక తన సినిమాల గురించి కూడా ప్రస్తావించారు చరణ్‌. నా సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం నేను డైరెక్టర్‌ శంకర్‌ గారితో 'గేమ్‌ ఛేంజర్‌' అనే సినిమా చేస్తున్నాను. ఇదోక పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఇది సరికొత్త స్టోరి, పొలిటికల్‌ కాన్సెప్ట్‌. నిజానికి శంకర్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్‌తో పనిచేయాలన్నది ప్రతి ఒక్క నటుడి కల.


'గేమ్ ఛేంజర్' కోసం శంకర్ చాలా కష్టపడ్డారు


నాకు ఈ అవకాశం నాకు దక్కింది. ఆయనతో వర్క్‌ చేయడం నాకు మంచి అనుభూతిని ఇచ్చింది. 'గేమ్‌ ఛేంజర్‌' కోసం శంకర్‌ గారు చాలా కష్టపడ్డారు. దాదాపు మూవీ షూటింగ్‌ పూర్తయినట్టే. ఇక అన్ని కార్యక్రమాల అనంతరం ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ లేదా అక్టోబరల్‌ రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాం" అని చెప్పుకొచ్చారు. కాగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందిస్తున్న వ్యక్తులను గుర్తించి వారికి డాక్టరేట్‌ ఇవ్వడంలో వేల్స్‌ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాదిగానూ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో చరణ్‌ను ఈసారి డాక్టరేట్‌తో సత్కరించింది వేల్స్‌. అలాగే చరణ్‌తో పాటు డా.పి.వీర‌ముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ చంద్ర‌యాన్‌, ఇస్రో), డా.జి.ఎస్‌.కెవేలు (ఫౌండ‌ర్‌, సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్‌), అచంట శ‌ర‌త్ క‌మ‌ల్ (ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత‌, ప్ర‌ముఖ టేబుల్ టెన్నిల్ ప్లేయ‌ర్‌)ల‌ను కూడా వేల్స్‌ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.