Assam CM Himanth Biswa Sharma Remarks On Rahul Gandhi: దేశంలో బీజేపీ నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గీతారెడ్డి అన్నారు. భారత దేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని.. కానీ బీజేపీ నేతలు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళళలను ఎంతో గౌరవించే దేశం మనది, ఇక్కడ ప్రతి మహిళను తల్లిగా, సోదరిగా భావిస్తాము, అలాంటిది అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Assam CM Himanth Biswa Sharma).. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి పైన నీచమైన భాషతో మాట్లాడటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు రాజకీయాలను పూర్తిగా కలుషితం చేస్తున్నారని విమర్శించారు. ఇంత ఘోరమైన రాజకీయాలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. కుటుంబాల గురించి మాట్లాడి బీజేపీ ప్రపంచంలో దేశ ప్రతిష్టను దిగజారుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి మండిపడ్డారు. అస్సాం ముఖ్యమంత్రిపై బీజేపీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకొని ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy) మండిపడ్డారు. అస్సాం సీఎం దేశంలో ఉండే మాతృమూర్తులందరినీ అవమానించే విధంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు వివాదం ఏంటంటే..
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాల్గొన్న కార్యక్రమంలో అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ హద్దులు దాటి మాట్లాడారు. భారత సైన్యం పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నమ్మడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ చేశారనడానికి ఆధారాలు ఉన్నాయా అని రాహుల్ గాంధీ అడుగుతున్నారని చెప్పారు. అయితే రాహుల్ గాంధీని ఎప్పుడైనా నువ్వు రాజీవ్ గాంధీ కుమారుడివేనా అని మేమెప్పుడు ప్రశ్నించలేదుగా అని హేయమైన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై అస్సాం సీఎం శర్మ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
Also Read: Revanth Reddy: కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ భరించదు, ఇప్పటికే రెండు సార్లు మోసపోయాం: రేవంత్ రెడ్డి