Feel the Jail Scheme in Sangareddy Jail :   జైలు  అంటే ఎవరికైనా భయమే. కానీ కొంత మందికి నేరాలు చేయాలంటే భయం కానీ.. జైలు అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి కోసం దేశంలో కొన్ని జైళ్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. దాదాపుగా ఆరు జైళ్లలో  నేరాలు చేయకపోయినా డబ్బులు కట్టి ఖైదీలుగా ఉండేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అలాంటి జైలు సౌకర్యాన్ని  సంగారెడ్డి జైల్లోనూ పొందే అవకాశం ఉంది.                       


సంగారెడ్డిలో అత్యంత పురాతనమైన జైలు ఉంది.   220 ఏళ్ల కిదంట దాన్ని నిర్మించారు. ఇప్పుడు  మ్యూజియంగా దాన్ని  మార్చారు. ఈ జైలును పర్యాటకంగా మార్చారు. అచ్చంగా జైల్లో ఖైదీ మాదిరిగా ఇక్కడ గడిపేందుకు రోజూ ఐదు వందలు చెల్లిస్తే సరిపోతుంది. ఖైదీల మాదిరిగానే డ్రెస్సులేసుకుని రోజువారీ వ్యవహారాలు  గడపాల్సి ఉంటుంది. సెల్ ఫోన్లు.. ఇతర వాటిని అంగీకరించరు.     

         
 
సంగారెడ్డి జైలు భవనాన్ని  1796  లో నిజాం హయాంలో సాలార్ జంగ్ I ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో నిర్మించారని చెబతారు.  ఈ ప్రాంతంలోని అతి పురాతన జిల్లా జైలు కూడా.   ఈ జైలు 3 ఎకరాల 10 గుంటల విస్తీర్ణంలో ఉంది. ఈ హెరిటేజ్ జైలు భవనంలో  మొత్తం పది  బ్యారక్‌లు ఉన్నాయి.  రెండు శతాబ్దాల చరిత్రలో సంగారెడ్డి జైలు వివిధ శాఖల అధిపతుల పర్యవేక్షణలో ఉంది.  1981 వరకు ఈ జైలు వైద్య శాఖ ఆధీనంలో ఉండేది.  1981లో జిల్లా జైలు, సంగారెడ్డి బాధ్యత జైళ్ల శాఖకు బదిలీ చేశారు. తర్వాత వారసత్వ కట్టడంగా మార్చారు. 


జైలును ఫీల్ అవ్వాలనుకునేవారు.. సంగారెడ్డి జైలు అధికారుల్ని సంప్రదిస్తే చాలు. ఐదు వందలు కట్టించుకుని ఖైదీగా మార్చేస్తారు.   ఖైదీల యూనిఫాం ఇస్తారు.   24 గంటల వరకు మీరు బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఖైదీలకు పెట్టే భోజనమే పెడతారు.  ఉప్మా , రోటీ , పప్పు, అన్నం, రసం   వంటి ఖైదీలకు అందించే భోజనమే వడ్డిస్తారు. అలాగే ఖైదీలతో చేయించే   తోటపని , క్లీనింగ్ వంటి పనులు కూడా చేయాల్సి ఉంటుంది.  పనులు చేసిన తర్వాత భోజనం పెడతారు. తర్వాత సెల్‌లోకి  నెట్టి తాళం వేస్తారు.  మరుసటి రోజు ఉదయం వదిలేస్తారు. మరో రోజు ఉండాలనుకుంటే ఐదు వందలు కట్టాల్సి ఉంటుంది. జైలు జీవితం భరించలేకరనుకుంటే.. వెంటనే వదిలేయరు. జరిమామా కట్టాల్సి ఉంటుంది. వెయ్యి రూపాయలు కడితే మద్యలో వదిలేస్తారు. లేకపోతే రోజంతా ఉండాల్సిందే.                      


జైలును ఫీల్ కావాలంటే నేరుగా సంగారెడ్డి జైలు అధికారుల్ని సంప్రదించాల్సిందే. ప్రత్యేకంగా ఆన్ లైన్ బుకింగులు ఇంకా పెట్టలేదు.