Telangana Floods : ఆ గ్రామంలో ఇళ్లే కనిపించడం లేదు. రెండు అంతస్తులు ఉన్న ఇళ్ల శ్లాబ్‌లు మత్రమే కనిపిస్తున్నాయి. మిగతా ఇళ్లన్నీ నీటిలోనే ఉండిపోయాయి. జనం అంతా చెట్ల మీదకు చేరిపోయారు. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం పరిస్థితి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుదవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. మొరంచ వాగు ఉగ్ర రూపానికి మొరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారి పై మొరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో మొరంచ వుప్పొంగి ప్రవహిస్తోంది. దీనితో 353సీ జాతీయ రహదారి పై రవాణా పూర్తిగా నిలిచి పోయింది. ఎగువన గణప సముద్రం 3 ఫీట్లు మేర మత్తడి పడుతుండం, ఆ నీరు మొరంచలో చేరటంతో ప్రవాహం ఉధృతి మరింత పెరిగింది.
దీంతో భారీగా వచ్చే నీటితో మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. బుధవారం రాత్రి నుండి ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో గ్రామస్థులు బస్టాండ్ ఆవరణలో ఉన్న ఓ బిల్డింగ్ పైకి ఎక్కి వర్షంలో భయం గుప్పిట్లో గడుపుతున్నారు.చుట్టూ ఎటు వెళ్లలేని పరిస్థితిలో అష్టజల దిగ్బంధంలో ఉండటంతో ఉదయమే అధికారులు రంగంలోకి దిగారు. మొరంచపల్లికి అధికారులు వెళ్లాలంటే ఇటు ఘనపురం లక్ష్మారెడ్డి పల్లి వరకే చేరుకునే అవకాశం ఉంది. అవతలి వైపు భూపాలపల్లి నుండి అధికారులు రావడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. భూపాలపల్లి మైసమ్మ గుడి వద్ద వాగు ఉదృతి పెరగటం, మొరంచపల్లి వద్ద మొరంచ ఉదృతంగా ప్రవహించడంతో అధికారులు చేరుకోలేని పరిస్థతి ఏర్పడింది.
కేవలం హెలికాప్టర్ ద్వారానే ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. గంట గంటకు మోరంచ ప్రవాహం ఉద్ధృతి పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. జిల్లా ఉన్నతధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. హెలికాప్టర్ ద్వారా ప్రజలను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేశారు.
తొలుత బోట్ల ద్వారా గ్రామస్తుల తరలింపు ప్రక్రియ చేపట్టగా.. వరద ప్రవాహం తీవ్రంగా వుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు ఆర్మీ హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు. దీంతో వేగంగా తరలింపు ప్రక్రియ చేపట్టారు. వీరందరికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారు అధికారులు. ప్రస్తుతం గ్రామం మొత్తం ఖాళీ అవ్వగా.. ఎవరైనా చిక్కుకుపోయారన్న అనుమానంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు .
సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ల సేవలు వినియోగించుకోవడం కష్టం అవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే మోరంచపల్లికి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్ బృందాలు) తరలివెళ్లాయి. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సంప్రదిస్తూ పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు సీఎస్ నివేదిస్తున్నారు. ఇతర వరద ముంపు ప్రాంతాల్లో కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.