Rohit Sharma:  టీమిండియా స్టార్ పేసర్  జస్ప్రిత్ బుమ్రా  రీఎంట్రీ ఎప్పుడు..? చాలాకాలంగా భారత క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది.  అసలే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ వంటి కీలక టోర్నీలు ముందున్న నేపథ్యంలో  హిట్‌మ్యాన్ వచ్చేది ఎప్పుడన్న  ప్రశ్నకు  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బుమ్రా రీఎంట్రీపై   కీలక అప్డేట్ ఇచ్చాడు.


గతేడాది జులైలో ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే సిరీస్ తర్వాత  వెన్ను గాయంతో   టీమ్‌కు దూరమై తిరిగి సెప్టెంబర్‌లో  ఆస్ట్రేలియాతో   ఒక టీ20 మ్యాచ్ ఆడి  మళ్లీ గాయం బారిన పడ్డ బుమ్రా.. కీలకమైన టీ20 వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు దూరమయ్యాడు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో  న్యూజిలాండ్ వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న బుమ్రా  ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.  ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ  క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ)లో రీహాబిటేషన్‌ పొందుతున్న బుమ్రా.. గత నెలలో  నిలకడగా 7 నుంచి 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. భారత జట్టు ఆగస్టులో ఐర్లాండ్ టూర్‌కు వెళ్లనుండగా  బుమ్రా కూడా ఈ మ్యాచ్‌లు ఆడతాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా రోహిత్.. బుమ్రా ఫిట్నెస్, రీఎంట్రీ గురించి స్పందించాడు. 


ఆడితే మంచిదే.. 


వెస్టిండీస్‌తో  వన్డే సిరీస్‌కు ముందు నిర్వహించిన  ప్రెస్ మీట్‌లో  రోహిత్ మాట్లాడుతూ..‘బుమ్రా అనుభవం ఎంతో ముఖ్యం.  ప్రస్తుతం బుమ్రా  చాలా తీవ్రమైన గాయం నుంచి కోలుకుంటున్నాడు. బుమ్రా త్వరలో  ఐర్లాండ్ పర్యటనకు వెళ్తాడా..? లేదా..? అన్నది నాకు తెలియదు.  ఐర్లాండ్‌కు వెళ్లబోయే టీమ్‌ను ఇంకా అనౌన్స్ చేయలేదు కదా.  ఒకవేళ బుమ్రా అక్కడికి వెళ్లితే అది మంచిదే.  వరల్డ్ కప్‌కు ముందు అతడు  కొన్ని మ్యాచ్‌లు ఆడితే టీమ్‌కు కూడా అది లాభించేదే. ఒక సీరియస్ ఇంజ్యూరీ నుంచి  కోలుకుని  తిరిగి జట్టులోకి వచ్చే ఆటగాళ్లకు  మ్యాచ్ ఫిట్‌నెస్, మ్యాచ్ ఫీలింగ్ చాలా ముఖ్యం..’అని చెప్పాడు. 


ఎన్సీఏతో టచ్‌లోనే ఉన్నాం. 


బుమ్రా ఫిట్‌నెస్,  అతడి రికవరీ ఎలా ఉంది..? అన్నదానిపై కూడా హిట్‌మ్యాన్  స్పందించాడు. ‘బుమ్రా కోలుకోవడంపైనే అతడి  రీఎంట్రీ ఆధారపడి ఉంది.  మేమైతే ఎన్సీఎతో నిత్యం టచ్‌లోనే ఉంటున్నాం. ప్రస్తుతానికైతే  బుమ్రా ఫిట్‌నెస్ గురించి పాజిటివ్  రివ్యూస్ వస్తున్నాయి..’అని  తెలిపాడు. 


కాగా గతేడాది ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముగిశాక విరామం తీసుకున్న బుమ్రా..  ఆసియా కప్‌కూ దూరమయ్యాడు.  వెన్ను గాయంతో పూర్తిగా ఫిట్నెస్ లేకపోయినా టీ20 వరల్డ్ కప్‌లో ఆడించాలనే ఆత్రుతలో బీసీసీఐ అతడిని సెప్టెంబర్‌లో  ఆస్ట్రేలియాతో  మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన  మ్యాచ్‌లో ఆడించింది.  కానీ గాయం తిరగబెట్టడంతో అతడు   పొట్టి ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. మళ్లీ ఈ ఏడాది జనవరిలో కూడా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినా తొలి వన్డేకు ముందే  అతడు  జట్టుకు దూరమై ఎన్సీఏకు చేరాడు. ఫిబ్రవరిలో  అతడు  న్యూజిలాండ్ వెళ్లి  వెన్ను గాయానికి సర్జరీ చేసుకున్న విషయం తెలిసిందే.  































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial