IND vs WI: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు రేపటి (జులై 27) నుంచి కరేబియన్ టీమ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. అయితే వన్డే సిరీస్ ఆడేందుకు గాను ట్రినిడాడ్ (రెండో టెస్టు జరిగిందిక్కడే) నుంచి బార్బడోస్ రావడానికి చాలా కష్టాలు పడింది. ట్రినిడాడ్ టు బార్బడోస్ వరకూ భారత ఆటగాళ్లు ప్రయాణించడానికి వీలుగా బీసీసీఐ.. ఫ్లైట్ బుక్ చేసింది. కానీ అది రాత్రి ప్రయాణం. రాత్రి ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో భారత క్రికెటర్లు ట్రినిడాడ్ విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనం మేరకు.. ట్రినిడాడ్‌లో టెస్టు ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు మంగళవారం రాత్రి ట్రినిడాడ్ ఎయిర్‌పోర్ట్‌కు నిర్దిష్ట సమయం మేరకే చేరుకున్నారు. బార్బడోస్ వెళ్లడానికి ఫ్లైట్ రాత్రి 11 గంటలకు బయలుదేరాల్సి ఉండగా అది పలు కారణాల రీత్యా క్యాన్సిల్ అయి నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో మెన్ ఇన్ బ్లూ బార్బడోస్ చేరడానికి బుధవారం ఉదయం 5 గంటలైంది. దీంతో భారత ఆటగాళ్లు తీవ్రంగా అలిసిపోయారట..
ఇదే విషయమై టీమిండియా మేనేజ్‌మెంట్‌లో ఒకరు స్పందిస్తూ.. ‘వాళ్లు (ప్లేయర్స్) రాత్రి 8.40 గంటలకే హోటల్స్ వీడారు. విమానాశ్రయంలో మేం చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది. 11 గంటలకు రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. వన్డేలకు ముందు విరామం తీసుకుందామని భావించిన ఆటగాళ్లు.. ప్లైట్ డిలే అవడంతో చాలా అలిసిపోయారు. ఈ విషయాన్ని మేం బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాం. రాత్రి పూట ప్రయాణాలు పెట్టొద్దని బోర్డును కోరాం. దీనికి బీసీసీఐ కూడా సానుకూలంగా స్పందించింది.. వచ్చే సిరీస్ నుంచి ఇటువంటివి జరుగకుండా చూసుకుంటామని మాతో చెప్పింది’ అని తెలిపాడు.
ఫ్లైట్ డిలే కావడంతో టీమిండియా ఆటగాళ్లు నేడు కూడా హోటల్ రూమ్స్ నుంచి బయటకు రాలేదని తెలుస్తున్నది. ఇక వన్డే సిరీస్ విషయానికొస్తే.. జులై 27, 29న బార్బడోస్ వేదికగానే రెండు వన్డేలు జరుగుతాయి. ఆగస్టు 01న మళ్లీ భారత జట్టు ట్రినిడాడ్‌కు వెళ్లనుంది. అక్కడ మూడో వన్డేతో సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ మొదలుకానుంది. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని యువ భారత జట్టు.. వెస్టిండీస్‌తో తలపడనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో రెండు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతాయి. వన్డేలతో పాటు టీ20లు ఆడే టీమ్ కూడా ఇదివరకే వెస్టిండీస్ చేరుకున్నది. వన్డేలు ముగిసిన తర్వాత పలువురు సీనియర్ ఆటగాళ్లు భారత్‌కు తిరిగి వస్తారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial