Team India Home Schedule for 2023-24 Season: భారత క్రికెట్ జట్టు 2023-24 సీజన్‌లో స్వదేశంలో ఆడబోయే  సిరీస్‌లకు సంబంధించి బీసీసీఐ  మంగళవారం  పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది  సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది  మార్చి వరకూ   భారత్‌లో ఆడబోయే పలు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది.   ఏడాదికాలంలో  స్వదేశంలో ఐదు టెస్టులు, 3 వన్డేలు, 8 టీ20లు ఆడనున్న భారత జట్టు.. ఎక్కువభాగం ద్వితీయ శ్రేణి నగరాల్లోని స్టేడియాల్లోనే ఆడనుంది.  భారత్‌లో   మ్యాచ్‌లకు విరివిగా ఆతిథ్యమిచ్చే  ప్రముఖ స్టేడియాలేవీ ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. 


అప్పుడు లొల్లి.. 


బీసీసీఐ తాజా షెడ్యూల్ ప్రకారం రాబోయే సీజన్‌లో మ్యాచ్‌లు  మొహాలీ, ఇండోర్, రాజ్‌కోట్, త్రివేండ్రం, వైజాగ్, గువహతి, నాగ్‌పూర్, రాంచీ, ధర్మశాలలో జరుగనున్నాయి. వీటిలో మొహాలీ, ఇండోర్, గువహతి  స్టేడియాలు   వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్‌లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్  మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తాయని అంతా భావించారు. కానీ బీసీసీఐ మాత్రం వీటికి మొండిచేయి చూపించింది. ముంబై, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, లక్నో, ఢిల్లీ, ధర్మశాల, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకే మ్యాచ్‌లు దక్కాయి.  హైదరాబాద్‌లో పేరుకు వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్నా ఆడేవి మూడు మ్యాచ్‌లే. అందునా ఒక్కటంటే ఒక్కటి కూడా భారత్ మ్యాచ్ లేదు. ఇది స్థానికంగా అభిమానులతో పాటు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్స్‌కు కూడా కోపం తెప్పించింది.   


మొహాలీ, ఇండోర్‌లలో మ్యాచ్‌లు లేకపోవడంపై పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ ప్రతినిధులు  బహిరంగంగానే బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. అలాగే అహ్మదాబాద్‌లో కీలక  మ్యాచ్‌లను నిర్వహించడంపై కూడా  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్, పంజాబ్ క్రీడా శాఖ మంత్రి, టీఎంసీ జాతీయ ప్రతినిధి ఒకరు  బీసీసీఐ, సెక్రటరీ  జై షా ను టార్గెట్ చేస్తూ  తీవ్ర విమర్శలు చేశారు.  


హామీ ఇచ్చిన బీసీసీఐ.. 


విమర్శల నేపథ్యంలో బీసీసీఐ  సెక్రటరీ జై షా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లను రాని  స్టేడియాలకు ద్వైపాక్షిక సిరీస్‌లలో ఎక్కువ మ్యాచ్‌లు కేటాయిస్తామని, రొటేషన్ విధానంలో అన్ని వేదికలకు సమాన  అవకాశాలు కల్పిస్తామని   బీసీసీఐ మీటింగ్‌లో కూడా చర్చించినట్టు తెలిపాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌లు దక్కిన స్టేట్స్ అసోసియేషన్స్.. మళ్లీ దీనికి పోటీగా రావొద్దని కూడా వాళ్లకు ముందే చెప్పినట్టు  వివరించాడు.  


 






తాజాగా  2023-24  హోమ్ సీజన్ షెడ్యూల్‌లో మ్యాచ్ వేదికలను బట్టి బీసీసీఐ మాట నిలబెట్టుకుంది.  త్రివేండ్రం,  గువహతి,   నాగ్‌పూర్, ఇండోర్, రాజ్‌కోట్‌తో పాటు  రెండు తెలుగు రాష్ట్రాలైన  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన స్టేడియాలకు మ్యాచ్‌లు దక్కాయి.   హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో  హైదరాబాద్‌తో టీ20 మ్యాచ్‌తో పాటు ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు జరగాల్సి ఉంది. వైజాగ్ కూడా ఆస్ట్రేలియాతో టీ20, ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ఆతిథ్యమివ్వనుంది.




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial