IND vs Wi ODI LIVE Streaming:  నెలరోజుల  కరేబియన్ దీవుల పర్యటనలో భారత జట్టు.. టెస్టు సిరీస్‌ను 1-0తో గెలుచుకుని నేటి నుంచి  50 ఓవర్ల ఫార్మాట్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది.  బార్బడోస్ వేదికగా నేటి రాత్రి (భారత కాలమానం ప్రకారం) మొదటి వన్డే జరగాల్సి ఉంది.  ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌‌కు అర్హత సాధించని వెస్టిండీస్.. దాని నుంచి బయటపడేందుకు సమాయత్తమవుతుండగా భారత జట్టు  ప్రపంచకప్ సన్నాహకాలను మొదలుపెట్టనుంది.  వన్డే సిరీస్ షెడ్యూల్,  లైవ్, జట్ల వివరాలు వంటివి ఇక్కడ చూద్దాం. 


సూర్య పైనే అందరి చూపు.. 


ఈ ఏడాది మార్చిలో  ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు వన్డేలు ఆడలేదు.  ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్, వెస్టిండీస్‌తోనే రెండు టెస్టుల తర్వాత దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత  పరిమిత ఓవర్ల ఆట ఆడనుంది.  ఆస్ట్రేలియా‌తో మూడు వన్డేలలోనూ దారుణంగా విఫలమైన  సూర్యకుమార్ యాదవ్  పైనే అందరికళ్లూ ఉన్నాయి.  ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్  వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగానే జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  సూర్య రాణిస్తేనే అతడికి   మెగా టోర్నీలో ఆడే అవకాశం దక్కుతుంది. ఆసీస్‌తో మూడు వన్డేలలోనూ మూడు డకౌట్లు అయిన సూర్యకు విండీస్ సిరీస్ మంచి అవకాశం.  శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ కూడా వరల్డ్ కప్ ఆడటంపై  సందేహాలు నెలకొంటున్న వేళ సూర్య ఈ అవకాశాన్ని ఏ మేరకు వినియోగించుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. టీ20లలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా నిరూపించుకున్నా  సూర్య ఇంకా వన్డేలలో తనదైన మార్కును చూపించలేదు.  ఈ నేపథ్యంలో విండీస్ సిరీస్ సూర్యకు అత్యంత కీలకంగా మారింది.  


కూర్పు అసలు సమస్య.. 


వెస్టిండీస్ నుంచి అంతగా పోటీ లేకపోయినా వన్డే సిరీస్‌లో  తుది జట్టు కూర్పే భారత జట్టుకు ప్రధాన సమస్యగా మారింది.   వన్డే జట్టులో చోటు దక్కిన రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కుతుందా..? అనేది అనుమానమే.  ఓపెనర్లుగా రోహిత్ - గిల్ వస్తారా లేక ఇషాన్ ను పంపిస్తారా అన్నది తేలాల్సి ఉంది.  ఇషాన్ ను తీసుకుంటే వికెట్ కీపర్ గా సంజూ శాంసన్‌ను పక్కనబెట్టాల్సి వస్తుంది.  ఇది కూడా  రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్‌లకు సవాలుగా మారింది.   ఇక రవీంద్ర జడేజాకు తోడుగా  కుల్దీప్, అక్షర్ పటేల్,  చాహల్‌లో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరం.  వన్డే సిరీస్‌లో  సిరాజ్‌కు విశ్రాంతినివ్వడంతో  ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్‌లలో ఎవరిని ఆడిస్తారో చూడాలి.  సిరాజ్‌కు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్‌లు  పేస్ బాధ్యతలు మోయనున్నారు. 


భారత్ - వెస్టిండీస్ వన్డే సిరీస్ షెడ్యూల్ : 


- జులై 27 : తొలి వన్డే -  బార్బడోస్
- జులై 29 : రెండో వన్డే - బార్బడోస్
- ఆగస్టు 01 : మూడో వన్డే - ట్రినిడాడ్ 


- బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరుగబోయే మొదటి వన్డే భారత కాలమానం ప్రకారం నేటి (గురువారం) రాత్రి 7 గంటల నుంచి మొదలవనుంది. 
- టీవీలలో ఈ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్‌లో లైవ్ చూడొచ్చు.  
- ఫ్యాన్ కోడ్ యాప్, వెబ్‌సైట్ లో ఈ మ్యాచ్‌లను వీక్షించొచ్చు. జియో  సినిమా ఉచితంగానే ప్రసారాలను అందిస్తోంది.  


వన్డే సిరీస్‌కు ఇరు జట్లు : 


వెస్టిండీస్ : షై హోప్ (కెప్టెన్),  రోమన్ పావెల్, అలిక్ అథనేజ్, యానిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రన్ హెట్‌మెయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోతీ,  జేడన్ సీల్స్, రొమారియా షెఫర్డ్, కెవిన్ సింక్లయర్, ఓషేన్ థామస్ 


భారత్ :   రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జయదేశ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ 






























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial