DK Aruna :  పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మహబూబ్ నగర్ బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ ఖండించారు.  కాంగ్రెస్ పార్టీలో గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఆ పార్టీ ముఖ్య నాయకులే నా ఓటమి కోసం ప్రత్యేకంగా పనిచేశారు. అందుకే ఆ పార్టీని వీడాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అధిష్టానం నాకు మంచి గుర్తింపుని ఇచ్చి హోదాను కల్పించిందన్నారు.  కాంగ్రెస్ పార్టీ గద్వాలలో బలమైన బీసీ నేతలు ఉన్నప్పటికీని స్థానికేతరులకు పోటీ చేసే అవకాశం కల్పించింది. పార్టీ నుండి స్థానికులైన బీసీలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళితే అందుకు అంగీకరించింది. ఈ కారణంగానే నేను గద్వాల నుండి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను తప్ప మరొక కారణం కాదని స్పష్టం చేశారు.  


పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైనా ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆదేశిస్తే చేస్తాను అని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు మైండ్ గేమ్ ఆడుతూ నేను పార్టీ మారుతున్నాను అంటూ దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు అని ఆమె స్పష్టం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా అసత్య ప్రచారాలు చేయొద్దని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేసేందుకు అదృష్టం ఉండాలని డీకే అరుణ అన్నారు.  అసెంబ్లీకి పోటీ చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం పట్టుబడితే.. తన తల్లిగారి ప్రాంతమైన నారాయణపేట నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారని.. దీనిని ఆ నియోజకవర్గ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. 


'కేసీఆర్ దమ్మేందో ఇండియా మొత్తం చూసింది' - మీకు కన్పించలేదా?, రేవంత్ రెడ్డికి కేసీఆర్ కౌంటర్


డీకే అరుణ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారంటూ.. రాజగోపాల్‌రెడ్డి మాదిరిగా చివరి నిమిషంలో బీజేపీని వీడి, కాంగ్రెస్‌లో చేరే అవకాశాలను తోసిపుచ్చలేమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె కాంగ్రెస్‌లో మక్తల్‌ లేదా నారాయణపేట సీటు అడుగుతున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.  గద్వాల నియోజకవర్గంలో 2004,2009,2014 ఎన్నికల్లో డీకే అరుణ విజయం సాధించారు. 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన అరుణ...రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో పని చేశారు. మారిన రాజకీయ పరిస్థితులతో బీజేపీలో చేరారు.


ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు షాక్ - ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి రాజీనామా !


ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ జోరుగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. పాత కాంగ్రె్స నేతల్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అడిగిన టిక్కెట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తోంది. ఈ క్రమంలో డీకే అరుణతోనూ సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది.అయితే డీకే అరుణ మాత్రం తీవ్రంగా  ఖండిస్తున్నారు. నామినేషన్లలో ఇంకా వారం రోజులే గడువు ఉన్నందున డీకే అరుణ ఈ సమయం పార్టీ మారబోరని ఆమె అనుచరులు అంచనా వేస్తున్నారు.