హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులకు రోబోల సేవలు అందుబాటులోకి రానున్నాయి. విమానాశ్రయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి విమానంలో కూర్చునేంత వరకూ రోబోలు ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించనున్నాయి. పరిశుభ్రతను మరింత మెరుగు పర్చేందుకు రోబోటిక్ పరిజ్ఞానంతో పని చేసే పరికరాలు, యంత్రాలను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఇందు కోసం జీఎంఆర్ ఇన్నోవెక్స్ పేరుతో 6 నెలల క్రితం ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం రోబోలు, యంత్రాలు, పరికరాలు తయారు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


అవగాహన ఒప్పందాలు


రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలపై ఐఐటీ - బాంబే, పెప్పర్ మెంట్, సైన్ సంస్థలతో అవగాహన ఒప్పందాలను అధికారులు కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా రోబోటిక్ ఉత్పత్తులను రూపొందించే స్టార్టప్ సంస్థలకూ ప్రొత్సాహం అందించనున్నారు. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం పనులు పూర్తైతే వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఎయిర్ పోర్టులో రోబోల సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. 


విమానాశ్రయ, విమానయాన రంగం కోసం కొత్త రోబోటిక్ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధికి ఎయిర్ పోర్ట్ అధికారులు సహకరించనున్నారు. ఇప్పటికే పలు స్టార్టప్ సంస్థల ప్రతినిధులు రూపొందిస్తోన్న ఆవిష్కరణలను ప్రోత్సహించి వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తున్నారు.


ప్రస్తుతం ఢిల్లీ, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏఐతో పని చేసే రోబోలను ఏర్పాటు చేశారు. అవి ప్రయాణికులకు విమానాల రాకపోకలు, ఎయిర్ లైన్స్ సమాచారాన్ని అందిస్తున్నాయి. విమానాశ్రయ పరిసరాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్ పోర్ట్స్ ప్రాంగణం, మెట్లు, వాష్ రూమ్స్ శుభ్రం చేసేందుకు ఇప్పటికే యంత్రాలను వినియోగిస్తున్నారు.


సమయం ఆదా


విమానాశ్రయాల్లో రోబోల సేవలు వినియోగించుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు ఎయిర్ పోర్టులోకి వచ్చింది మొదలు వారు విమానంలో కూర్చునేంత వరకూ అవసరమైన సమాచారాన్ని వీటి ద్వారా అందిస్తే క్యూ లైన్లనేవే ఉండవని పేర్కొంటున్నారు. రద్దీ సమయాల్లో సమస్యలను అధిగమించవచ్చని స్పష్టం చేస్తున్నారు.


Also Read: మేడిగడ్డ కుంగడానికి కారణం అదేనా? నిపుణుల కమిటీ ఏం చెప్పిందంటే!