ఏపీలో పేదల బతుకులు బాగు చేసిన ఘనత సీఎం జగన్ దేనని వైసీపీ నేతలు ప్రశంసించారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ 'సామాజిక సాధికార యాత్ర' పేరుతో చేపట్టిన బస్సు యాత్రం గురువారం ఇచ్ఛాపురం నుంచి ప్రారంభంమైంది. మొత్తం 60 రోజుల పాటు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు బయలు దేరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమాన్ని నేతలు ప్రజలకు వివరించనున్నారు. మధ్యాహ్నం ఇచ్ఛాపురం బస్టాండులో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నారు.


'సంతోషంగా ఉంది'


ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. మంత్రులు బొత్స, మేరుగ నాగార్జున, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు వి.కళావతి, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ, వరుదు కల్యాణి పాల్గొన్నారు.


'సంక్షేమాన్ని వివరిస్తాం'


'గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ హయాంలో అందిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్. కేబినెట్ లోనూ సామాజిక న్యాయం చేశారు. వైసీపీకి ఓటు వేయని వారికీ సంక్షేమ పథకాలు అందించాం. అవినీతికి తావు లేకుండా ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయి. విద్యా రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు - నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేస్తున్నారు. పేదల బతుకులు బాగు చేసిన ఘనత సీఎం జగన్ దే' అని వైసీపీ నేతలు, మంత్రులు ప్రశంసించారు.


షెడ్యూల్ ఇదే


అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకూ మొదటి విడత సామాజిక సాధికార యాత్ర జరగనుంది. తొలి రోజు ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలోని శింగనమలలో యాత్రలు జరగనున్నాయి. మొదటి విడతలో 39 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగనుంది. ఆయా ప్రాంతాల్లో వైసీపీ ముఖ్య నేతలు యాత్రలో పాల్గొంటారు. ఆయా నియోజకవర్గాల్లో ముందుగా ఎంపిక చేసిన సచివాలయాన్ని వైసీపీ నేతలు సందర్శిస్తారు. ఇక్కడే ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్లు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, స్థానికంగా ఎంపిక చేసిన 200 మందితో కలిసి సహాపంక్తి భోజనం చేస్తారు. బస్సు యాత్ర జరిగే మార్గంలో ముందుగా నిర్ణయించిన చోట్ల ప్రజలతో మమేకమవుతారు. అదే రోజు సాయంత్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ సభలో బస్సు పై నుంచే నేతలు ప్రసంగిస్తారు. ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు. 


వీరిపైనే స్పెషల్ ఫోకస్


వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికార యాత్రను బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో, ప్రజలకు వివరించడమే లక్ష్యంగా యాత్ర ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేదలకు - పెత్తందార్లకు మధ్యే యుద్ధమనే నినాదాన్ని బస్సు యాత్ర ద్వారా బలంగా తీసుకెళ్లాలని సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో వైసీపీ నేతలు క్లాస్ వార్ స్లోగన్‌తో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లేదా సమన్వయకర్తల అధ్యక్షతన బస్సు యాత్ర జరగనుంది. ప్రతి బస్సులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు తప్పకుండా ఉండేలా ప్లాన్ చేశారు. మొదటి విడతలో నవంబర్ 9 వరకూ ఒక్కో రోజు 3 ప్రాంతాల్లో యాత్రలు సాగనున్నాయి.