తెలంగాణలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో భాగంగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్సీ) అర్హత ఉన్నవారి నియామకాలపై నిర్ణయం తీసుకోకపోవడంపై ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవలే నోటీసులు జారీ చేసింది. ప్రీ నర్సరీ టీచర్ల నియామకాలు చేపట్టకపోవడంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. 



రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 25లో డీపీఎస్సీ అభ్యర్థులను చేర్చకపోవడాన్ని సవాలు చేస్తూ.. ఆకుల సురేష్, మరో 35 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2020 కేంద్ర విద్యావిధానం ప్రకారం డీపీఎస్సీ పూర్తి చేసినవారి నియామకాలు చేపట్టాల్సి ఉంది. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. 

పిటిషనర్ తరఫు న్యాయవాది సీహెచ్.గణేష్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ, మున్సిపల్, జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో డీపీఎస్సీ నియామకాల కోసం 2018 నుంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో డిప్లొమా తీసుకున్నవారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఏపీ, కేరళ, పంజాబ్‌ తదితర రాష్ర్టాల్లో ప్రీ-ప్రైమరీ టీచర్లుగా డీపీఎస్సీ అభ్యర్థులను నియమిస్తున్నారని తెలిపారు.


తెలంగాణలో 400 మందికిపైగా అభ్యర్థులు డీపీఎస్సీ కోర్సు పూర్తిచేసినా వారిని ప్రభుత్వ పాఠశాలల్లో నియమించలేదని పేర్కొన్నారు. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, డీఎస్సీ నియామకాల్లో డీపీఎస్సీ అభ్యర్థుల్నీ చేర్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. 

వాదనలను విన్న న్యాయమూర్తి పాఠశాల విద్యాశాఖ, ఆర్థిక శాఖ, మహిళా, శిశు సంక్షేమశాఖ, ముఖ్యకార్యదర్శులు, ఎన్‌సీటీఈ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, మెదక్‌లోని డైట్ ప్రిన్సిపల్‌లకు మరోసారి నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నవంబరు 7కు వాయిదా వేశారు.


ALSO READ:


మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ రాతపరీక్ష వాయిదా, త్వరలో కొత్త తేదీ వెల్లడి!
తెలంగాణలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్' పోస్టుల భర్తీకి నవంబరు 10న నిర్వహించనున్న రాతపరీక్షను వాయిదావేసినట్లు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే పరీక్ష కొత్త తేదీని ప్రకటించనున్నట్లు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ తెలిపింది. రాతపరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక చేయనున్నారు. సర్వీస్‌ వెయిటేజీ కింద ఇచ్చే మార్కులను సైతం 20 నుంచి 30 మార్కులకు పెంచారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్&టెక్నీషియన్ పోస్టులు, వివరాలు ఇలా
పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్- వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ కేడర్‌లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 08 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మిధానిలో 54 జూనియర్/సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని మిశ్రధాతు నిగం లిమిటెడ్‌(మిధాని) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 ఖాళీలను భర్తీచేయనున్నారు. పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు నవంబరు 1లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష, ట్రేడ్ టెస్టుల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..