కేసీఆర్ దమ్మేందో ఇండియా మొత్తం చూసిందని, 'ఒకరు కొడంగల్ రా, కొడవలితో రా' అంటూ అడుగుతున్నారని, 'మీ కళ్లకు కన్పిస్తోంది కేసీఆర్ దమ్ము కాదా?' అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేటలోని బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన ఆయన, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించానని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్ల దగ్గర ఉన్నారో తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలుండేవని, ఇక్కడి ప్రజలు ముంబయికి ఉపాధి కోసం వలస పోయినప్పుడు ఎవరైనా వచ్చారా.? అంటూ నిలదీశారు.
ఇక ప్రజల వంతు
తెలంగాణ ప్రయాణంలో పదో సంవత్సరంలో ఎన్నికలు వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం కోసం తన వంతు పోరాటం అయిపోయిందని ఇక చేయాల్సింది ప్రజలే అని అన్నారు. 'తెలంగాణ కోసం ఒంటరి ప్రయాణం ప్రారంభించా. నా పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే విజయం సాధించాను. సరిపడా నీళ్లు, కరెంట్, సాగు, తాగు నీరు లేక ఎన్నో అవస్థలు పడ్డాం. ఇవాళ దేశం మొత్తంలో 24 గంటల కరెంట్ ఇస్తోన్న రాష్ట్రం తెలంగాణ. ప్రధాని రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు దేశానికే దిక్సూచిలా నిలిచేలా తెలంగాణ ఎదిగింది. కేసీఆర్ దమ్ము దేశమంతా చూసింది. ఇప్పుడు కొత్తగా ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు.' అని పేర్కొన్నారు.
ఆలోచించి ఓటెయ్యండి
ఒకప్పుడు తెలంగాణలో 60 లక్షల టన్నుల ధాన్యం పండేదని, ఇప్పుడు 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. 24 గంటల కరెంట్ ఇస్తే, కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ కండువా కప్పుకొంటానని జానారెడ్డి సవాల్ విసిరారని, ఆ తర్వాత వెనక్కు తగ్గారని గుర్తు చేశారు. రైతు బంధు పథకానికి ఆద్యుడు కేసీఆర్ అని చెప్పారు. రైతు బంధును దశలవారీగా రూ.16 వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. పాలమూరు - ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ నేతలు 109 కేసులు వేశారని, ప్రాజెక్టులు పూర్తైతే కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని ఇలా చేశారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎవర గెలిస్తే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందో, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందో వారినే గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే ధరణిని తొలగిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అలా చేస్తే రైతులు మళ్లీ అధికారుల ముందు మోకరిల్లాల్సిన దుస్థితి వస్తుందని వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఆగం కాకుండా, అన్నీ ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు. బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఉన్న తెలంగాణను పోగొట్టింది కాంగ్రెస్ యేనని మండిపడ్డారు. 2004లో తెలంగాణ ఇస్తామని ప్రకటించి 2014లో ఇచ్చారని గుర్తు చేశారు. 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించాలని కోరారు.