Afghanistan Earthquake



మళ్లీ భూకంపం..


అఫ్గనిస్థాన్‌లో మరోసారి (Afghanistan Earthquake) భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. దాదాపు 150 కిలోమీటర్ల లోతు వరకూ ప్రభావం చూపించినట్టు అధికారులు వెల్లడించారు. అఫ్గనిస్థాన్‌లో ఇలా భూమి కంపించడం నాలుగోసారి. National Centre for Seismology వెల్లడించిన వివరాల ప్రకారం...అర్ధరాత్రి 1.09 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. వారం రోజుల్లోనే దాదాపు నాలుగు సార్లు భూకంపం సంభవించింది. హెరాత్‌లో సంభవించిన భూకంపం ధాటికి 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే ఎక్కడో ఓ చోట మళ్లీ భూమి కంపిస్తూనే ఉంది. అక్టోబర్ 15న రిక్టర్‌ స్కేల్‌పై 5.4 తీవ్రత నమోదైంది. అంతకు ముందు అక్టోబర్ 13న 4.6 తీవ్రత రికార్డ్ అయినట్టు NCS స్పష్టం చేసింది. అక్టోబర్ 11న తీవ్రత 6.1గా నమోదైంది. ఈ భూకంపాల ధాటికి వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ లెక్కల ప్రకారం...1,983 ఇళ్లు కూలిపోయాయి. హెరాత్‌లోని 20 గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి. నిజానికి...ఈ లెక్కలు తేల్చడం కష్టం అని చెబుతోంది తాలిబన్ ప్రభుత్వం. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే...పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేయడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 






మృతుల్లో 90% మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి అధికారుల వెల్లడించారు. తాలిబన్లు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ భూకంపాల కారణంగా 2 వేల మంది మృతి చెందారు. జెండా జన్ (Zenda Jan Earthquake) లోనే దాదాపు 1,294 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1,688 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. మొదటి సారి భూకంపం వచ్చినప్పుడు తీవ్రత 6.3 గా నమోదైంది. చాలా వరకూ గ్రామాల ఆనవాళ్లు తుడిచి పెట్టుకుపోయాయి. అంతా మట్టే మిగిలిపోయింది. స్కూళ్లు, హాస్పిటల్స్ కూడా నేలమట్టమయ్యాయి. చాలా మంది తమ వాళ్ల కోసం గాలిస్తున్నారు. భూకంప సమయంలో ఎవరి దారిలో వాళ్లు పరుగులు పెట్టారు. ఇప్పుడు తమ వాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. ఆ శిథిలాల మధ్యే జల్లెడ పడుతున్నారు. హెరాట్‌లోని ఏకైక ప్రధాన ఆస్పత్రి క్షతగాత్రులతో కిటకిటలాడుతోంది. అంతర్జాతీయ సమాజం స్పందించాలంటూ ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినా ఇప్పటివరకూ అంతర్జాతీయ సమాజం నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఐక్యరాజ్యసమితి (United Nations) మానవతా కార్యాలయం భూకంప ప్రతిస్పందన కోసం 5 మిలియన్ డాలర్లు విలువైన సాయం ప్రకటించింది. తాలిబాన్లు అఫ్ఘాన్‌లో పాలనను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశానికి అంతర్జాతీయ సహాయం నిలిపివేశారు. 


Also Read: మణికట్టుకి బ్రేస్‌లెట్‌లు, మోచేతులపై పేర్లు - తమ వాళ్లను గుర్తు పట్టేందుకు పాలస్తీనా పౌరుల అవస్థలు