నత్తలు, వీటిని వివిధ దేశాల్లో వివిధ రకాలుగా పెంచుతుంటారు. చైనా వంటి దేశాల్లో తింటారు. అయితే, ఇవి పంట నాశనానికి కూడా కారణమవుతాయి. అలాంటి థాయ్ లాండ్ నత్తలను భారత్ లో నిషేధించగా వాటిని ఓ వ్యక్తి పెంచుతున్న ఘటన ఏపీ కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో జరిగింది. విశ్వశాంతి విద్యా సంస్థల ఛైర్మన్ రెండో కుమారుడు మాదల చంద్రశేఖర్, నిషేధిత థాయ్ లాండ్ నత్తలను కాటూరు రోడ్డు విద్యా సంస్థ ప్రాంగణంలోనే పెంచుతున్నాడు. వాటి కోసం ప్రత్యేకంగా ట్యాంకులు కట్టించి పెంపకాన్ని చేపట్టాడు.


యూట్యూబ్ వీడియోతో వెలుగులోకి
మాదల చంద్రశేఖర్ నిషేధిత నత్తలను పెంచడమే కాకుండా, ఆ విధానాన్ని యూట్యూబ్ వీడియో చేసి ఆన్ లైన్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు మంచి వ్యూస్ రాగా, దీన్ని చూసిన జీవశాస్త్ర నిపుణులు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో జీవ జాతుల నియంత్రణ రక్షిత విభాగం అధికారులు విశ్వశాంతి ప్రాంగంణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడి ట్యాంకులను పరిశీలించారు. నత్తలు బ్యాన్ చేయబడిన థాయ్ లాండ్ కు చెందినవని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇవి చాలా డేంజర్


ఈ నత్తలు చాలా ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. ఈ ట్యాంకుల నుంచి ఒక్క నత్త బయటకు వచ్చినా, అది 50 సెంట్ల స్థలాన్ని నాశనం చేయగలదని అంటున్నారు. అవి పెట్టే గుడ్ల వల్ల మరింతగా వ్యాపించి, ముప్పు ఇంకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యా సంస్థల్లో ప్రమాదకర నత్తల పెంపకంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వీటిని తీసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. 


పలు అనుమానాలు


నత్తలను ఎలా తీసుకొచ్చారు.?, జలమార్గంలో తెచ్చారా.?, విమానంలో తరలించారా.? అసలు నిషేధిత నత్తలను ఇక్కడ ఎందుకు పెంచుతున్నారు.?, వీటిని ఇంకా ఎక్కడికి ఎక్స్ పోర్ట్ చేయాలని చూస్తున్నారు.? వంటి అంశాలపై అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. థాయ్ లాండ్ లో కొనుగోలు చేసినట్లుగా బిల్లులు చూపించాలని కోరగా, అతని నుంచి సరైన సమాధానం రాలేదని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.


అప్పుడు మిడతల దండు


మిడతల దండు, ఈ పేరు చెబితే రైతులందరికీ వణుకు పుడుతుంది. కరోనా తర్వాత మూకుమ్మడి దాడి చేసి అనేక పంటలు నాశనం కావడానికి కారణమయ్యాయి. మిడతల దండు దాడితో ఎకరాల్లో పంటలు నష్టం వాటిల్లే విధానాన్ని ఓ తెలుగు సినిమాలోనూ చూపించారు. ఇప్పుడు నిషేధిత నత్తలను ఇలా పెంచడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.