బాలీవుడ్ స్టార్ కపుల్స్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ సింగ్ ఎప్పుడూ ఫుల్ ఫన్నీగా ఉంటారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, ఇద్దరూ భలే హ్యాపీగా ఉంటారు. ఆయా షోలలో పాల్గొన్నప్పుడు వారు చేసే అల్లరి మమూలుగా ఉండదు. తాజాగా వీరిద్దరు కలిసి ‘కాఫీ విత్ కరణ్’ 8వ సీజన్ లో గెస్టులుగా పాల్గొన్నారు. ఈ షోలో వాళ్లు చేసిన సందడి మామూలుగా లేదు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పనిలో పనిగా తమ పెళ్లి వీడియోను కూడా ఈ షోలో రివీల్ చేశారు.
ఇన్నాళ్లకు దీపిక, రణవీర్ పెళ్లి వీడియో వచ్చేసింది!
దీపికా, రణవీర్ 2018లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతికొద్ది మంది బంధు మిత్రుల నడుమ వీరి పెళ్లి అయ్యింది. వీరి వివాహం జరిగి 5 ఏళ్లు అవుతున్నా, ఇప్పటి వరకు దానికి సంబంధించిన వీడియోలు బయటకు రాలేదు. ఎట్టకేలకు ‘కాఫీ విత్ కరణ్’ షోలో విడుదల చేశారు. తాజాగా ఈ జంట కరణ్ టాక్ షోలో పాల్గొన్నది. హోస్ట్ కరణ్ జోహార్ దీపిక, రణవీర్ అభిమానులకు వారి పెళ్లి వీడియోను చూపించి ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియోలో మాల్దీవుల్లో దీపికకు రణ్‌వీర్ సింగ్ ప్రపోజ్ చేయడం, దీపిక తల్లిదండ్రులను కలిసి ఎంగేజ్ మెంట్ గురించి చెప్పడానికి బెంగళూరుకు వెళ్లే విజువల్స్ ఇందులో ఉన్నాయి. దీపిక, రణవీర్ ను జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం పట్ల ఆమె తల్లి తొలుత సంతోష పడలేదని చెప్పారు. అయితే, చివరకు ఆమెను ఒప్పించినట్లు వెల్లడించారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన వీడియో, ఎంగేజ్ మెంట్ పార్టీలో దీపిక తన గురించి చెప్పుకోవడంతో మొదలవుతుంది. దీపికా తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్రకాష్ పదుకొణె కూడా రణవీర్ తమ నలుగురితో కూడిన బోరింగ్ ఫ్యామిలీకి కొత్త ఉత్సాహాన్ని తెస్తాడని చెప్తారు. సరస్సు పక్కనే మెహందీ వేడుక జరపడం, అందులో రణవీర్ డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తాయి. దీపిక చక్కగా నగలు అలంకరించుకుని కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
భావోద్వేగానికి గురైన కరణ్, ఓదార్చిన దీపిక
ఇక ఈ వీడియోను చూసి కరణ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ పెళ్లి వీడియో చూస్తుంటే తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. జీవితంలో తాను ఏదో కోల్పోతున్నాననే ఫీలింగ్ కలిగిందన్నారు. కరణ్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఆయన పిల్లలను దత్తత తీసుకున్నారు. ఈ వీడియో చూశాక తనకు కూడా జీవిత భాగస్వామి ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ కలుగుతుందన్నారు. బాధ పడకు సరైన సమయంలో సరైన వ్యక్తి నీ భార్యగా వస్తుందని దీపికా కరణ్ ను ఓదార్చుతుంది. ఇక 8వ సీజన్ తొలి ఎపిసోడ్ అక్టోబర్ 25న ప్రసారం కానుండగా, అనంతరం ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది.
Read Also: మావారి కంటే ఆయనే బెస్ట్, దీపికా కామెంట్స్‌కు రణవీర్ షాక్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial