Yoga Day 2024: వయసు పెరిగే కొద్ది వచ్చే ప్రధానమైన ఆరోగ్యసమస్యల్లో కడుపు ఉబ్బరం కూడా ఒకటి. కొన్నిసార్లు జీవనశైలి, సరైన ఆహార అలవాట్లు లేనివారిలో కూడా వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య బాధిస్తుంది. ఈ సమస్య ఉన్నవారికి రోజూ అసౌకర్యంగానే ఉంటుంది. అంతేకాదు ఇది మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుంది. కలుషితమైన ఆహారం తినడం, ఒత్తిడి, గ్యాస్ట్రిక్ సమస్యలను ప్రేరేపించే ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఉబ్బరం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూ ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు కూడా గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. 


యోగాతో సమస్య దూరం..


ఈ సమస్యను మీరు తగ్గించుకోవాలనుకుంటే.. గట్ మైక్రోబయోమ్​ను సమతుల్యం చేసే, గట్​ బ్యాక్టీరియా స్థితిని మెరుగుపరిచే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్​ని తీసుకోవడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలికంగా మీరు కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. అంతేకాకుండా.. యోగా ద్వారా కూడా ఈ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు. భోజనం తర్వాత.. వజ్రాసనం వంటి ఆసనాలు క్రమం తప్పకుండా చేస్తే.. మెరుగైన జీర్ణక్రియను పొందుతారు. జీర్ణక్రియ చురుగ్గా ఉన్నప్పుడు గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. 


బరువు కూడా తగ్గొచ్చు..


కడుపులోని గ్యాస్​ని వదిలించుకోవడానికి కూడా యోగా ఆసనాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేసే పవనముక్తాసనం గురించి మీరు తెలుసుకోవాలి. ఈ పవనముక్తాసనం పేగు కార్యకలాపాలు మరింత చురుగ్గా జరిగేలా చేస్తుంది. ఈ ఆసనం కడుపు, పేగులలో పేరుకుపోయిన గ్యాస్​ను విడుదల చేయడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. తద్వారా మీరు బరువు కూడా తగ్గవచ్చు.


మరెన్నో ప్రయోజనాలు..


కాలేయం స్థితిని మెరుగుపరిచి.. కడుపులోని గ్యాస్ బయటకు పోయేలా చేస్తుంది. ఈ ఆసనంతో గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు పోగొట్టుకోవడమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది రెగ్యూలర్​గా చేయడం వల్ల మీ వెన్నెముక, కటి ప్రాంతం బలపడుతుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.


ఆసనం ఎలా చేయాలంటే..


ఈ ఆసనం చేయడానికి మీరు నేలపై లేదా యోగా మ్యాట్​పై పడుకోండి. ఇప్పుడు మీ మోకాళ్లను ఛాతీ వద్దకు తీసుకువచ్చి.. మీ చేతులతో వాటిని పట్టుకోండి. అనంతరం మీ ఎడమకాలును వదులుతూ.. నేలపై చాచండి. ఈ ఆసనంలో 30 సెకన్లు ఉండాలి. ఇదే విధంగా రెండో వైపు కుడికాలితో చేయండి. ఇలా నిమిషంపాటు.. పునరావృతం చేస్తూ.. మూడు సార్లు ఈ ఆసనం చేయాలి. ఇది రెగ్యూలర్​గా చేస్తూ ఉంటే.. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గి.. మెరుగైన జీర్ణక్రియను పొందుతారు. 


Also Read : ఉదయాన్నే కాఫీకి బదులు ఇది తాగితే చాలా మంచిదట!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.