BRS News : ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్‌కు గురువారం రాజీనామా చేశారు.  ఎమ్మెల్సీగా ఉన్న దామోదర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికలలో టికెట్టు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. సంవత్సరంన్నర క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి ఎంపికయ్యారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పొసగక కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. ముందుగా తన కుమారుడు రాజేష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చడంతో ఆయనకు నాగర్కర్నూల్ నుండి పోటీ చేసే అవకాశం లభించింది. దామోదర్ రెడ్డి మాత్రం పార్టీకి రాజీనామా చేయకుండా తన కుమారుడికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.


ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా దామోదర్ రెడ్డి ఎట్టకేలకు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపారు. స్థానికంగా ఉన్న సమస్యలను పలుమార్లు మీ దృష్టికి తీసుకువచ్చిన వాటిని మీరు పరిష్కరించలేకపోయారు. స్థానికంగా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. ఈ కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటూ దామోదర్ రెడ్డి ముఖ్యమంత్రికి పంపిన లేఖలో పేర్కొన్నారు.   ‘‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి వెళ్లి కలిసేవాడ్ని. కానీ, కేసీఆర్ ఈ నాలుగున్నర సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. పదిసార్లు వెళ్లినా.. కనీసం కలవలేదు. పార్టీ పరంగా నాకు సముచిత స్థానం కల్పించినప్పటికీ.. స్థానికంగా ఉండే సమస్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని లేఖలో పేర్కొన్నారు.                      


స్థానికంగా ఎటువంటి ప్రయారిటీ లేదని.. ఎమ్మెల్సీ అంటే ఒక స్టిక్కర్ వేసి మీరు పడి ఉండండి అని కేసీఆర్ అంటున్నారని ఆరోపించారాయన. కేటీఆర్‌ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోలేదని లేఖలో విమర్శించారు కూచుకుళ్ల. మరోవైపు  నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పొసగకపోవడమే కూచుకుళ్ల రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారతారనే ప్రచారం గత నాలుగైదు నెలలుగా నడుస్తోంది కూడా. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైంది. కాంగ్రెస్‌ తరపునే తూడుకుర్తి గ్రామ సర్పంచ్ గా, ఎంపీపీగా, 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీగా గెలిచి మహబూబ్‌ నగర్‌ జిల్లా ఛైర్మన్‌గా పనిచేశాడు. 


ఐదుసార్లు నాగర్‌ కర్నూల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసి నాగం జనార్ధన్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే  ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి రెండుసార్లు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారాయన. బీఆర్‌ఎస్‌కు రాజీనామా నేపథ్యంలో.. ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నెల చివర్లో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొనే బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఆయన కుమారుడు ఇప్పటికే నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.