ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డునపడుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బయటకు వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు పూర్తి బలంగా ఉంది. గెలుపు నల్లేరు నడకలా ఉన్న టీఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు అంతర్గతంగా ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఇప్పుడు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అవసరమైతే పార్టీని వదిలి వెళతామని సంకేతాలు అందిస్తుండటంతో వారిని బుజ్జగించే పనిలో నాయకులు నిమగ్నమయ్యారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నాలుగు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉంటూ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Also Read : ఏపీ వరి ధాన్యం లారీలకు తెలంగాణలో నో ఎంట్రీ .. సరిహద్దుల్లో నిలిచిన లారీలు !
కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న నేతలపై దృష్టి సారించి వారిని సముదాయిస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావుపై ఉన్న అసంతృప్తితో సుమారు 16 మంది కౌన్సిలర్లు అలకపాన్పు ఎక్కినట్లు సమాచారం. వీరితోపాటు కొంత మంది ఎంపీటీసీలు కూడా జతకలిసినట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్థానిక నేతలతో కలిసి వారితో మంతనాలు సాగించి బుజ్జగించినట్లు తెలుస్తోంది.
Also Read : నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం.. ధాన్యం సేకరణపై కేంద్రంతో తేల్చుకుంటారా!
వైరా, ఇల్లందు నియోజకవర్గాలో సైతం కొంత మంది ఎంపీటీసీలు అసంతృప్తితో ఉండటంతో వారిని సముదాయించేందుకు కొంత మంది నేతలకు ఆ పనిని అప్పగించారు. వైరా నియోజకవర్గంలోని కొంత మంది ఎంపీటీసీలు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు సమాయత్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఉన్న అసంతృప్తి నేపథ్యంలో తమ ఓటర్లు ఎటూ వెళ్లకుండా ఉండేందుకు మరో రెండు రోజుల్లో ఓటర్లను క్యాంపులకు తరలించే పనిలో టీఆర్ఎస్ నేతలు పడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో అప్పటి వరకు టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న నేతలను కొత్తగా వచ్చిన నేతలు కలుపుకోకపోవడం, తమ వర్గానికే అన్ని విషయాల్లో ప్రాధాన్యత కల్పిస్తుండంతో అప్పట్నుంచి వర్గపోరు నెలకొని ఉంది. ప్రధానంగా వైరా, పాలేరు, కొత్తగూడెం, ఇల్లందు నియోజకవర్గాలో టీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత పోరు నెలకొని ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న అంతర్గత పోరు కాస్తా ఇప్పుడు బట్టబయలు అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన ఓట్లు ఉన్నప్పటికీ అసంతృప్తుల బెడద మాత్రం టీఆర్‌ఎస్ పార్టీని కలవరపెడుతుంది.
Also Read : సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?