కేంద్రంలోనూ, తెలంగాణలోనూ రైతుల అంశం గత కొన్నిరోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా ధాన్యం సేకరణపై కేంద్రం ఓమాట, రాష్ట్రం ఓ మాట చెబుతున్నాయంటూ అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. ఇది జరిగిన తరువాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఏం తేల్చుకోకుండానే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి రాగా.. నేడు మరోసారి తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చర్చలకు సిద్ధమైంది. 


కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకొనేందుకు తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం శుక్రవారం ఢిల్లీకి వెళ్తోంది. నవంబర్ 23న జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీలో ఏ విషయం తేలకపోవడంతో.. ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్వర్యంలో మంత్రులు మహమూద్‌ అలీ,  సీహెచ్ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌తో కూడిన బృందం నేడు ఢిల్లీలో చర్చలు జరుపుతారు. రైతులకు మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్లు ప్రధాన అంశాలుగా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో శుక్రవారం సాయంత్రం తెలంగాణ మంత్రులు, అధికారుల టీమ్ సమావేశం అవుతుంది.


Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు ! 


యాసంగిలో రైతులు ఎలాంటి పంటలు వేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, రాష్ట్ర రైతులకు చెబుతామని రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కొత్త సాగు చట్టాలపై కేంద్రం ఆలోచించి చివరికి ఉపసంహరించుకున్నందున రైతులకు సానుకూల నిర్ణయం వస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే నాలుగు రోజులపాటు కేసీఆర్ ఢిల్లీలో పర్యటించినా ఎటూ తేల్చుకోకపోవడం రాజకీయంగా వివాదాస్పదమైంది. కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్లు, ఏ పంటలు వారికి లాభదాయకం లాంటి అంశాలు, ఇతరత్రా రైతుల సమస్యలపై నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ మంత్రులు, అధికారుల టీమ్ నేటి సాయంత్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించనుంది. రాష్ట్ర రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, సీఎం కేసీఆర్ అందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటారని నేతలు చెబుతున్నారు. 
Also Read: తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి