అకస్మాత్తుగా టమోటా ధరలు పెరిగిపోయాయి. కొన్ని చోట్ల కిలో రూ.100 కు మించి అమ్ముతున్నారు. టమోటా రుచికి అలవాటు పడిన ప్రాణాలు, వాటి ధర పెరిగిపోయేసరికి తట్టుకోలేకపోతున్నాయి. చుట్టూ ఎన్నో కూరగాయలు కనిపిస్తున్నా టమోటా ఇచ్చే రుచిని తలచుకుంటున్నారు చాలా మంది. అదే రుచి కావాలనుకుంటే టమోటాకు బదులు కొన్ని ప్రత్యామ్నయాలు ఉన్నాయి.  ఆ పుల్లటి రుచితో పాటూ, ఆరోగ్యాన్ని అందిస్తాయి. టమోటాలకు బదులు ఇవి వంటల్లో వాడి చూడండి. ఈ ప్రత్నామ్నాయాలన్నీ చవకైనవే.


1. పచ్చి మామిడి పొడి
ఇది మార్కెట్లలో అందుబాటులో ఉంటోంది. టమోటా లాగే తీపి, పులుపు కలిపిన రుచిని అందిస్తుంది. అంతేకాదు చవకైనది కూడా. మీరు చేయాల్సిందల్లా మీ కూరలో ఒక టీస్పూను పచ్చి మామిడి పొడి కలపండి. రుచి అదిరిపోతుంది. అచ్చు టమోటాలు వేసిన రుచే వస్తుంది. 


2. చింతపండు
టమోటాకలు బదులు చింతపండు గుజ్జును కూడా ఉపయోగించవచ్చు. చింతపండును పావుగంట నానపెట్టి తరువాత మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి. ఆ గుజ్జును కూరల్లో వేసుకుంటు ఇగురులా వస్తుంది. అంతేకాదు కూర గట్టిపడటంలో సహాయపడుతుంది. 


3. ఉసిరి
శీతాకాలంలో ఉసిరిని వాడితే మరీ మంచిది. ఇది కూడా కాస్త పుల్లగానే ఉంటుంది. నీటిలో ఉసిరి ముక్కల్ని నానబెట్టాలి. తరువాత వాటిని మెత్తగా పేస్టు చేసుకుని కూరల్లో వాడాలి. 


4. సొరకాయ
టమోటా రుచిని ఇది ఇవ్వలేదు కానీ, కూరకి టమోటా వల్ల కలిగే ప్రయోజనాన్ని సొరకాయ అందించగలదు. సొరకాయ, కాస్త చింతపండు వేసి మెత్తగా పేస్టులా చేసుకుని కూరలకి జోడిస్తే టమోటాలాగే ఇగురు వస్తుంది. చింతపండు చేర్చాం కాబట్టి కాస్త పులుపు రుచి కూడా తెలుస్తుంది. కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయి. 


5. పెరుగు
బిర్యానీలలో, చికెన్ కర్రీలలో పెరుగు వాడడం చూస్తుంటాం. అలాగే టమోటాల స్థానంలో కూడా పెరుగును వాడుకోవచ్చు. మసాలాలతో పెరుగు బాగా మిళితం అవుతుంది. అందుకే దీన్ని కూరల్లో రుచి కోసం వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా కాస్త పుల్లగా ఉండే పెరుగును వాడితే టమోటాల రుచిని కూరకు అందిస్తుంది. 


Read Also: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే


Read Also: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం


Read Also: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి