థైరాయిడ్ సమస్య అధికంగా మహిళల్లోనే కలుగుతుంది. థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయకపోతే మానసికంగా, శారీరకంగా స్త్రీలు ఎన్నో ఇబ్బందులు పడతారు. థైరాయిడ్ సమస్యను తొలినాళ్లలోనే గుర్తిస్తే సమస్య తీవ్రం కాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో పీరియడ్స్ రాకపోవడం, పెళ్లయిన మహిళ్లలో పిల్లలు కలగకపోవడం వంటి వాటి నుంచి ముందే బయటపడొచ్చు. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే...


మెడ దగ్గర వాపు
థైరాయిడ్ గ్రంథి మెడ భాగంలో ఉంటుంది. థైరాయిడ్ పనితీరులో మార్పు రాగానే అక్కడ వాపు కనిపిస్తుంది. నీళ్లు గుటక వేసినప్పుడు ఆ భాగం ఇంకా ఎత్తుగా కనిపిస్తుంది. దీన్నే గాయిటర్ అని కూడా పిలుస్తారు. 


బరువు పెరుగుతారు
థైరాయిడ్ వల్ల మెల్లగా బరువు పెరగడం ఆరంభమవుతుంది. హైపో థైరాయిడిజం ఉన్న వాళ్లలో బరువు పెరిగే లక్షణం కనిపిస్తుంది. అదే హైపర్ థైరాయిడిజం అయితే సన్నగా మారిపోతారు. 


నీరసం
థైరాయిడ్ సమస్య వల్ల నిత్యం నీరసంగా అనిపిస్తుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. నిద్ర సరిగా పట్టదు. చికాకుగా అనిపిస్తుంది. చిన్న పని చేసినా అలసిపోతారు. హైపోథైరాయిడిజం వచ్చిన వాళ్లలో ఈ మార్పులు కనిపిస్తాయి. 


గుండె దడ
హైపర్ థైరాయిడిజం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీని వల్ల గుండె దడగా అనిపిస్తుంది. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్లకి గుండెల్లో గాభరాగా అనిపిస్తుంది. హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇక హైపో థైరాయిడిజం ఉన్నవారిలో మాత్రం గుండె కొట్టుకునే వేగం నెమ్మదిస్తుంది. 


ఈ లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఇప్పుడు చాలా మంది మహిళల్లో థైరాయిడ్ గ్రంధి పనితీరు తప్పుతోంది. కాబట్టి ప్రతి మూడు నెలలకోసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం


Read Also: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది


Read Also: మేనరికపు వివాహాలు మంచివి కావా? పుట్టే పిల్లల్లో నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి