తెలుగు కుటుంబాలలో మేనరికపు వివాహాలు సర్వసాధారణం. కొంతమంది మేనత్త, మేనమామ పిల్లలను చేసుకుంటే ఆస్తి బయటి వాళ్లకి పోదనే ఆలోచనతో మేనరికపు వివాహాలు చేసుకుంటుంటే, మరికొందరు దగ్గరి వాళ్లను చేసుకుంటే అనుబంధాలు మరింత బలపడతాయన్న ఆలోచనతో ఈ పెళ్లిళ్లకు ఓకే చెబుతున్నారు. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని దూరంగా ఉన్నవారికి ఇవ్వలేక, కళ్ల ముందే ఉంటారన్న ఉద్దేశంతోనూ మేనమామ కొడుకునే అల్లుడిగా చేసుకునే వారూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20శాతం పెళ్లిళ్లు దగ్గరి బంధువుల్లోనే జరుగుతున్నాయి. ఇక మనదేశంలో ఇలా వివాహాలు మరీ ఎక్కువ. ఇలాంటి వివాహాలను వైద్య పరిభాషలో ‘కన్‌సాంగ్వినియస్ మ్యారెజెస్’ అంటారు. 


బిడ్డలో లోపాలెందుకు?
ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే ముందు పిండం ఏర్పడే విధానాన్నితెలుసుకోవాలి.  ఒక మానవ కణంలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి. అంటే మొత్తం 46 క్రోమోజోములు. వీటిలో 23 మహిళ నుంచి, 23 పురుషుడి నుంచి వస్తాయి. అవి కలిసి ఒక కణంగా ఏర్పడతాయి. ఆ కణం పిండంగా మారుతుంది. ఇక ఈ క్రోమోజోములు ఎన్నో జన్యువుల సమ్మిళితం. ఈ జన్యువులే తండ్రి నుంచి, తల్లి నుంచి పోలికలను మోసుకొస్తాయి. వేరువేరు కుటుంబాలకు చెందిన  స్త్రీ, పురుషుడు కలవడం వల్ల ఆరోగ్యకరమైన పిండం ఏర్పడే అవకాశం అధికంగా ఉంటుంది. దానికి కారణం తల్లి నుంచి వచ్చిన జన్యువు క్వాలిటీ లేకుండా చెడిపోయి ఉండొచ్చు. అప్పుడు పురుషుడి నుంచే వచ్చే జన్యువు ఆరోగ్యకరంగా ఉంటే అది స్త్రీ జన్యువును డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు పుట్టే బిడ్డలో ఎలాంటి లోపాలు ఏర్పడకపోవచ్చు. కానీ ఒకే కుటుంబానికి చెందిన స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకుంటే ఇద్దరి జన్యువులు ఒకేలా ఉండొచ్చు. అంటే అనారోగ్యకర జన్యువులు కలవచ్చు. అప్పుడు పుట్టే బిడ్డలో ఏమైనా లోపాలు తలెత్తవచ్చు. అందుకే మేనరిక వివాహాలకు దూరంగా ఉండమని చెబుతారు వైద్యులు. 
 
ఎలాంటి లోపాలు రావచ్చు?
మేనరికం వివాహాలు చేసుకున్నవారికి పుట్టుకతోనే లోపాలతో బిడ్డలు పుట్టే అవకాశం ఉంది. అలాగే థలసీమియా, మూత్రపిండాల వ్యాధులు, కండరాలు, నరాల వ్యాధులు, బుద్ధిమాంద్యం, శ్వాససంబంధిత సమస్యలు, గుండెలో రంధ్రాలు... వంటి అనారోగ్య సమస్యలు మేనరికానికి పుట్టిన బిడ్డల్లో కలగచ్చు. అలాగని మేనరికపు వివాహాలు చేసుకున్న అందరికీ ఇలాంటి పిల్లలే పుడతారని చెప్పలేం. అలాంటి పెళ్లిళ్లు చేసుకున్నవారిలో 4 నుంచి 6 శాతం మందికి పుట్టిన పిల్లల్లో ఇలా జరగొచ్చు.  


గర్భం దాల్చాక...
జన్యుపరమైన సమస్యలను అడ్డుకోవడం చాలా కష్టం. ఒక్కసారి గర్భం వచ్చాక వైద్యులు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటూ ఎప్పటికప్పుడు బిడ్డ ఆరోగ్యాన్ని, లోపాలను తెలుసుకుంటూ ఉండాలి. సమస్య మెదడుకు సంబంధించినది అయినా, సరిచేయలేనిది అయినా ఏం చేయాలో వైద్యులే సలహా ఇస్తారు. ఒక్కోసారి గర్భస్రావం చేసుకోమని కూడా సలహా ఇస్తారు వైద్యులు. అలాంటివి అయిదు నెలల గర్భంలోపలే మనదేశంలో అనుమతిస్తారు. 


గర్భం రాకముందు...
మేనరికపు వివాహాలను చేసుకున్నవారు గర్భం దాల్చడానికి ముందే వైద్యులను కలిసి జాగ్రత్తపడడం ముఖ్యం. జెనెటిక్ కౌన్సిలింగ్ కు వెళ్లడం ఉత్తమం. వైద్యులు సంప్రదించి వారు చెప్పిన మందులు వాడాలి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం