నిద్రలేమి సమస్య ఎక్కువైపోతున్న కాలం. చాలా మంది దీనికి కారణం పని ఒత్తిడి, పెరుగుతున్న మానసిక ఆందోళన అని చెబుతారు. అది నిజమే కావచ్చు, కానీ మరో సైలెంట్ కిల్లర్ కూడా ఉంది. అదే ఉప్పు. మీరు తినే ఆహారం ఉప్పు అధికంగా ఉంటే ఆ రాత్రికి నిద్ర సరిగా పట్టక పోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా వృద్ధులపై ఉప్పు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వారు మిగతావారితో పోలిస్తే ఉప్పును సగానికి పైగా తగ్గించుకోవాలి. లేకుంటే నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వీరు రాత్రిపూట రెండు మూడు సార్లు మూత్రానికి వెళ్తుంటారు. అలా వెళ్లినప్పుడల్లా నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఇక వీరు ఉప్పు అధికంగా తింటే మూత్రం మరిన్ని ఎక్కువ సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వయసు మళ్లిన వారు ఉప్పును చాలా తగ్గించుకోవాలి.
అవసరమే కానీ...
ఉప్పు తినడం అవసరమే కానీ, అధికంగా తింటే మాత్రం అనర్థమే. సోడియం కోసం మనం ఉప్పును తింటాం. రక్తం పరిమాణాన్ని నియంత్రణలో ఉంచటంలో సోడియానిదే కీలక పాత్ర. ఆహారం ద్వారా ఉప్పు అధికంగా ఒంట్లో చేరితే రక్తంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల కణాల నుంచి నీరు వచ్చి రక్తంలో కలుస్తుంది. దీంతో రక్తం పరిమాణం పెరుగుతుంది. రక్తం ఎక్కువైతే మూత్రం కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దీంతో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావచ్చు.
కేవలం వయసు మళ్లిన వారికే కాదు, ఏ వయసులో ఉన్నవారికైనా ఇదే జరుగుతుంది. అప్పుడు వారికి నిద్రకు భంగం కలుగుతుంది. వెంటనే నిద్రపట్టక ఇబ్బంది పడతారు. అంతేకాదు రక్తపోటు కూడా పెరుగుతుంది. దీని వల్ల ప్రశాంతంగా అనిపించక నిద్రపట్టదు. దీంతో కిడ్నీలు అధికంగా పనిచేయాల్సి వస్తుంది. రక్తంలో చేరిన నీటిని ఒంట్లోంచి బయటకు పంపించేందుకు అవి ప్రయత్నిస్తాయి. మొత్తమ్మీద ఉప్పు వల్ల శరీరంలోని ముఖ్య అవయవాలకు ముప్పు తప్పదు. కాబట్టి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్
Read Also: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Read Also: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి