NGT Penalty : తెలంగాణకు జాతీయ హరిత ట్రైబ్యునల్(NGT) షాక్ ఇచ్చింది. వ్యర్థాల నిర్వాహణలో విఫలమైనందుకు రూ.3825 కోట్ల జరిమానా విధించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర స్థానిక సంస్థల్లో మున్సిపాలిటిల్లో వ్యర్థాలను శుద్ధి చేయడంలో విఫలమైనందుకు ఎన్జీటీ తెలంగాణకు రూ. 3,825 కోట్ల జరిమానా విధించింది. న్యూఢిల్లీలోని ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 29న ఈ పిటిషన్ ను విచారించింది. అయితే వ్యర్థాల ఉత్పత్తికి కారకులపైన వారి నుంచి ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని సూచించింది. 2021 ఏప్రిల్ 7న వ్యర్థాల పరిష్కారానికి సంబంధించిన చట్టబద్ధమైన కాలపరిమితి ముగిసిందని NGT ప్రధాన బెంచ్ తెలిపిరింది.  


ఉత్పత్తి కారకులను నుంచి ఛార్జీలు 


వ్యర్థాల ఉత్పత్తికి కారకులైన గృహాలు, కార్పొరేట్, వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి వినియోగదారు ఛార్జీల వసూలకు తగిన యంత్రాంగాన్ని రెండు నెలల్లో రూపొందించాలని ఎన్జీటీ తెలిపింది. మునిసిపల్ సాలిడ్ వేస్ట్ నిబంధనలను తక్షణమే అమలుచేయడానికి మిషన్ మోడ్‌లో తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ట్రైబ్యునల్‌కు ప్రధాన కార్యదర్శి చివరిసారిగా హాజరైన ఫిబ్రవరి 2020 నుంచి, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో ఇప్పటికీ భారీగా వ్యత్యాసం ఉన్నందున గణనీయమైన పురోగతి లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్రం సమర్పించిన సమాచారం ప్రకారం ద్రవ వ్యర్థాలు, మురుగునీటి ఉత్పత్తి శుద్ధిలో రోజుకు 1,824.42 మిలియన్ లీటర్లు, ఘన వ్యర్థాల నిర్వహణలో రోజుకు 2,446 టన్నుల వ్యత్యాసం ఉందని ఎన్జీటీ బెంచ్ తెలిపింది. 


రెండు నెలల్లోగా 


 ఈ జరిమానాను రెండు నెలల్లోగా ప్రత్యేక ఖాతాలో జమచేయాలని ఎన్జీటీ తెలంగాణ సీఎస్ ను ఆదేశించింది. పర్యావరణ దిద్దుబాటు చర్యల కోసం ఈ నిధిని వినియోగించాలని సూచించింది. మురుగునీటి నిర్వహణ శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న వాటిని ఆధునికీకరించుకోవాలని ఎన్జీటీ సూచించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎస్ ను ఆదేశించింది. అన్ని జిల్లాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో  నిర్దిష్ట కాలపరిమితిలోగా నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. పర్యావరణ ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే మరింత జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తామని ఎన్జీటీ హెచ్చరించింది. ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత సీఎస్ పై ఉందని స్పష్టంచేసింది. ఈ ఉత్తర్వులు అమలుకు సీనియర్‌స్థాయి అధికారిని నోడల్‌ సెక్రటరీగా నియమించాలని ఆదేశించింది. ఈ అంశంపై ఎన్జీటీ రిజిస్ట్రార్‌ జనరల్‌కు సీఎస్ ఆరు నెలలపాటు నివేదిక పంపాలని తెలిపింది.


వ్యర్థాల నిర్వహణలో లోపాలు 


దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ అంశాన్ని 18 ఏళ్ల పాటు విచారించిన సుప్రీంకోర్టు 2014లో ఆ బాధ్యతలను ఎన్జీటీకి బదిలీ చేసింది. ఎన్జీటీ గత ఎనిమిదేళ్లుగా ఈ అంశంపై సుదీర్ఘ విచారణ చేపట్టింది. 2016 నుంచి 2022 మే నెల వరకు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై పలు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. వ్యర్థాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో 2019 నుంచి రాష్ట్రాల సీఎస్ లను పిలిపించి మాట్లాడింది. 2019 ఏప్రిల్‌ 29న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్జీటీ ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ చర్యలపై ఆదేశాలు జారీ చేసింది. 2020 ఫిబ్రవరి 14న ఎన్జీటీ ముందు సీఎస్‌ మరోసారి హాజరయ్యారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై తెలంగాణ సీఎస్‌ గత సెప్టెంబర్ 28న ఎన్జీటీకి నివేదిక అందించారు. ఈ నివేదికను పరిశీలించిన ఎన్జీటీ తమ ఆదేశాలను పాటించలేదని ఆక్షేపించింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో ఇప్పటికీ లోపాలున్నాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ ఉత్పత్తి అవుతున్న మురుగునీరు, శుద్ధి ప్లాంట్ల మధ్య 1,824 ఎంఎల్‌డీ వ్యత్యాసం ఉందని తెలిపింది. మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోయిందని తెలిపింది. ఇప్పటికీ శుద్ధి చేయని మురుగునీటిని అలాగే వదిలేస్తున్నారని, దీంతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతిని రోగాలు ప్రబలున్నాయని పేర్కొంది. తమ ఆదేశాలను అమలు చేయనందుకు పరిహారం చెల్లించాలని తాజా ఉత్తర్వులు జారీ చేసింది.