AP Special Status :   ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రత్యేకహోదా హామీ ఇచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీ స్పెషల్ స్టేటస్ ప్రకటిస్తామని ఆ పార్టీ నేత జైరాం రమేష్ కర్నూలులో ప్రకటించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో ఉంది. ఆ రాష్ట్రం నుంచి ఏపీలోకి ఎంటరవనుంది. నాలుగు రోజుల పాటు ఏపీలో పాదయాత్ర సాగుతుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కర్నూలు జిల్లాలో జైరాం రమేష్ పర్యటిస్తున్నారు. ఆలూరు నుంచి మంత్రాలయం వరకూ పాదయాత్ర సాగుతుంది. అసలు ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీయేనని తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ మోసం చేసిందని జైరాం రమేష తెలిపారు .


విభజన చట్టం తయారీలో కీలకంగా వ్యవహరించిన జయరాం రమేష్ 


ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రూపకల్పనలో జైరాం రమేష్ కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని బీజేపీలో కీలక నేతగా ఉన్న వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. చివరికి తప్పని పరిస్థితుల్లో ఐదేళ్లపాటు ఏపీకి ప్రత్యేకహోదాను రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఐదేళ్లు కాదు పదేళ్లివ్వాలని  వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. అయితే బిల్లులో ఆ మేరకు పెట్టి చట్టసవరణ చేయకుండా ప్రధాని ప్రకటనతోనే  బిల్లు పాస్ చేసేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని ప్రకటించింది. హోదాకు బదలుగా అవే ప్రయోజనాలతో ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. ఈ విషయం ఇప్పటికీ ఏపీలో రాజకీయ అంశంగా మారింది. 


గత ఎన్నికల్లోనూ  ప్రత్యేకహోదా హామీ ఇచ్చిన కాంగ్రెస్ 


నిజానికి కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఒకే మాట మీద ఉంది. గత ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ అదే చెప్పింది. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామనే చెప్పింది. కానీ అప్పటికే ఏపీలో ఆ పార్టీ పూర్తిగా నిర్వర్యమైపోయింది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్, లీడర్ మొత్తం వైఎస్ఆర్‌సీపీలో చేరిపోయింది. దీంతో ఆ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఇప్పటికీ కోలుకోలేదు. అందులే రాహుల్ గాంధీ పాదాయత్ర కోసం ఎక్కువ సమయం కేటాయించకుండా కేవలం నాలుగు రోజులతో ఏపీ దాటి తెలంగాణలోకి వెళ్లిపోయేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. 


ప్రత్యేకహోదా అసాధ్యమంటున్న బీజేపీ 


ప్రత్యేక హోదా సాద్యం కాదని.. సాక్షాత్తూ జగన్ లేద చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయినా ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించలేరని బీజేపీ నేతలు చెబుతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలుస్తుందో.. ఎప్పుడు ప్రత్యేకహోదా ఇస్తుందో కానీ.. ఆ పార్టీకి ఏపీలో ఈ హామీ ఎలాంటి రాజకీయ ప్రయోజనం కల్పించే అవకాశం లేదు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడల్లా మళ్లీ పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు.