Srikakulam News: శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. టెక్నాలజీ విషయంలో ఇంతగా దూసుకుపోతున్న ఈ రోజుల్లోనూ ఇంకా బహిష్కరణలు జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జిల్లాలోని జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన రజకులపై భౌతికదాడులు చేస్తూ రజకులను గ్రామం నుంచి బహిష్కరించేందుకు స్థానిక సర్పంచ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దాంతో స్థానిక సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన రజకులు నిరసన చేపట్టారు. వీరికి మద్దతుగా బీసీ రజక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఈగలపతి ఉష శ్రీ సంఘీభావం తెలిపారు. 


అనంతరం ఉష శ్రీ మాట్లాడుతూ గ్రామానికి చెందిన రజకులకు, వారి పిల్లలకు సరైన ఉపాధి లేకపోవడం వలన కొన్నేళ్లుగా వలస వెళ్లి కుల వృత్తులకు దూరమయ్యారని, స్థానికంగా ఉన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి కుటుంబ పోషణ నిమిత్తం వలసలు వెళుతున్నారని అన్నారు. గ్రామంలో ఉన్న కొద్దిమంది రజకులు గిట్టుబాటు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని అన్నారు. స్థానిక సర్పంచు, గ్రామ పెద్దలకు చెప్పినప్పటికీ వినకుండా భౌతిక దాడులకు పాల్పడుతూ గ్రామ బహిష్కరణ చేసేందుకు టీడీపీకి చెందిన స్థానిక సర్పంచ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న సర్పంచ్ తో పాటు ఆయనకు మద్దతుగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 


ఇదే విషయమై జి. సిగడాం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు కలెక్టర్ కు, డీఎస్పీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు చెబుతున్నారు గ్రామస్తులు. అత్యవసర పరిస్థితుల్లో మందులు కొనడానికి కూడా తమకు అనుమతి ఇవ్వటం లేదని వాపోయారు. పక్క ఊరికి వెళ్లాలి అంటే అక్కడ కూడా అందరూ ఏకమై తమను దూరం చేస్తున్నారని అన్నారు. దయచేసి మమ్మల్ని కాపాడాలంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు.


మంత్రికి మావోయిస్టుల లేఖ!


మరోవైపు, శ్రీకాకుళం (Srikakulam) జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజుకు (Minister Seediri Appalraju) మావోయిస్టుల లేఖ రాశారు. పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భూముల కబ్జా పెరుగుతోందంటూ మావోయిస్టులు లేఖ రాశారు. ఆ లేఖ కూడా సొసైల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ భూ కబ్జాలో మంత్రి అప్పలరాజు (Minister Seediri Appalraju) ప్రమేయం ఉందని కూడా ఏవోబీ స్పెషల్ జోన్ మావోయిస్టు కమిటీ పేరుతో లేఖ విడుదలైనట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Seediri Appalraju) స్పష్టత ఇచ్చారు.