CM KCR Meets Akhilesh Yadav :  తెలంగాణ సీఎం కేసీఆర్‌ను దిల్లీలో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భేటీ అయ్యారు. దిల్లీలోని కేసీఆర్‌ నివాసంలో ఇరువురు సమావేశం అయ్యారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ దేశవ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. 






రైతు కుటుంబాలకు పరామర్శ 


సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పలువురు రాజకీయ, ఆర్థిక, జాతీయ మీడియా ప్రముఖులతో కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం దిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలపై పోరాడి ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. 


ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ


దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ జాతీయ ప్రత్యామ్నాయ కూటమి రూపకల్పన కోసం రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ తాజాగా దిల్లీతో పాటు పంజాబ్‌, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలలో ముఖ్యమంత్రులు, జాతీయస్థాయి నేతలు తదితరులతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారు. ఈ నెల 22న మధ్యాహ్నం దిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్తారు. అనంతరం పంజాబ్ వెళ్తారు. దాదాపు నాలుగు రోజుల పాటు సీఎం కేసీఆర్‌ పంజాబ్‌లోనే ఉంటారు.


 మే 22వ తేదీన మధ్యాహ్నం సీఎం కేసీఆర్ దిల్లీ నుంచి చంఢీఘర్ వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి సీఎం కేసీఆర్ చేపడతారు. రైతు ఉద్యమంలో చనిపోయిన పంజాబ్, హరియాణా ఉత్తర్ ప్రదేశ్, దిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులు అందచేస్తారు.


బెంగాల్, బిహార్ లో పర్యటన 


మే 26న సీఎం కేసీఆర్ బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ ప్రధాని దేవగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమౌతారు. బెంగుళూరు నుంచి మే 27న రాలేగావ్ సిద్ది పర్యటనను చేపట్టనున్నారు. అక్కడ సామాజికి ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసీఆర్ భేటీఅవుతారు. సాయిబాబా దర్శనం కోసం సీఎం కేసీఆర్ షిరిడీ వెళతారు. అక్కడ నుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైద్రాబాద్ చేరుకుంటారు. మే 29 లేదా 30న బెంగాల్, బిహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్ సంసిద్ధం కానున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను ఆర్థిక సాయం చేయనున్నారు