IPL 2022 Will Arjun Tendulkar Make His IPL Debut vs dc : ఐపీఎల్‌ 2022లో 69వ మ్యాచ్‌కు వేళైంది. వాంఖడే వేదికగా ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians), దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తలపడుతున్నాయి. ఈ సీజన్లో ముంబయికి ఇదే చివరి మ్యాచ్‌. మరి ఇప్పుడైనా సచిన్‌ తెందూల్కర్‌ కుమారుడు అర్జున్‌కు చోటిస్తారా?


ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో అర్జున్‌ తెందూల్కర్‌ను ముంబయి ఇండియన్స్‌ కనీస ధరకే కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ముంబయి వరుసగా ఏడు మ్యాచులు ఓడింది. దాంతో ఎనిమిదో మ్యాచులోనే అర్జున్‌ అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. నిజానికి లక్నోతో మ్యాచుకు ముందు టీమ్‌ మీటింగ్‌లో అర్జున్‌కు క్యాప్‌ ఇచ్చారు. అందుకే అర్జున్‌ మాతృమూర్తి అంజలి, సోదరి సారా ఆ మ్యాచుకు వచ్చారు. కానీ టాస్‌కు ముందు జట్టు యాజమాన్యం తన ఉద్దేశం మార్చుకున్నట్టు కనిపించింది. ఆఖరి క్షణాల్లో అతడి పేరును తొలగించినట్టు తెలిసింది.


ఈ సీజన్లో ముంబయి ఆడుతున్న చివరి మ్యాచ్‌ ఇదే. చాలామంది కొత్త కుర్రాళ్లకు ఇప్పటికే అవకాశం ఇచ్చింది. చెప్పుకోదగ్గవారిలో అర్జున్‌ తెందూల్కర్‌ ఒక్కడే మిగిలాడు! దాంతో దిల్లీతో పోరులో అర్జున్‌కు కచ్చితంగా చోటిస్తారని తెలుస్తోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ ముగిశాక రోహిత్‌ సైతం పరోక్షంగా ఇదే సూచించాడు. మరికొందరు కుర్రాళ్లను పరీక్షిస్తామని చెప్పాడు. ఈ లెక్కన అర్జున్‌ అరంగేట్రానికి ముహూర్తం కుదిరినట్టే! అందుకే ట్విటర్లోనూ అర్జున్‌ తెందూల్కర్‌ పేరు ట్రెండ్‌ అవుతోంది.


వాస్తవంగా అర్జున్‌కు ఎప్పుడో చోటివ్వాల్సింది! కానీ అంచనాల ఒత్తిడి అతడిపై మరీ ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప బ్యాటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ కొడుకు కావడమే ఇందుకు కారణం. ఒకవేళ అర్జున్‌ ఒత్తిడితో బాగా రాణించకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రోలింగ్‌ కూడా భయంకరంగా ఉంటుంది. సచిన్‌ కొడుకు కావడంతో టాలెంట్‌తో సంబంధం లేకుండా అతడిని తీసుకున్నారన్న అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు అర్జున్‌ అలాంటి అపవాదును ఎదుర్కొన్నాడు. ఎలాగూ ముంబయికి ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌ లేదు కాబట్టి ముందుగానే అతడికి ఛాన్స్‌ ఇచ్చి ఉంటే బాగుండేదని మరికొందరి అభిప్రాయం.