IPL 2022, MI vs DC: ఐపీఎల్‌ 2022లో 69వ మ్యాచ్‌కు వేళైంది. వాంఖడే వేదికగా ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians), దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తలపడుతున్నాయి. ఈ సీజన్లో ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్న ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఇదే! ఎందుకంటే ఆర్సీబీ (RCB), డీసీ (DC) ప్లేఆఫ్స్‌ చేరికను ఈ మ్యాచ్‌ ఫలితంమే నిర్దేశిస్తుంది. మరి డీసీ, ఎంఐలో పైచేయి ఎవరిది? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?


DCకి అనుకూలం


ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్‌ది ఘోరమైన ప్రదర్శన. 13 మ్యాచుల్లో కేవలం 3 గెలిచింది. అందరికన్నా ముందే ఎలిమినేట్‌ అయింది. మరోవైపు కరోనా కేసులు వెంటాడినప్పటికీ దిల్లీ క్యాపిటల్స్‌ ఆత్మవిశ్వాసంతో ఆడింది. ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌ను పదిలంగా ఉంచుకుంది. 13 మ్యాచుల్లో 7 గెలిచి 14 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. వారు నాకౌట్‌ చేరుకోవాలంటే ఈ మ్యాచులో ముంబయిని కచ్చితంగా ఓడించాలి. లేదంటే ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. అందుకే ఈ పోరులో ముంబయికి బెంగళూరు ఫ్యాన్స్‌ మద్దతు ఇస్తున్నారు. ఈ సీజన్లో తలపడ్డ మొదటి మ్యాచులో ముంబయిపై దిల్లీ గెలిచింది.


DC జాగ్రత్త!


దిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమతూకంగా ఉంది. అవసరమైన బ్యాకప్‌ ఆటగాళ్లూ అందుబాటులో ఉన్నారు. డేవిడ్‌ వార్నర్‌, సర్ఫరాజ్‌ మంచి ఓపెనింగ్‌ ఇస్తే డీసీకి తిరుగుండదు. వరుస హాఫ్‌ సెంచరీలతో మిచెల్‌ మార్ష్‌ దూకుడుగా ఆడుతున్నాడు. అతడు ఫామ్‌లో ఉంటే ట్రోఫీని అందించగలడు. రిషభ్ పంత్‌ ఇంకా మెరుగ్గా ఆడాలి. రోమన్‌ పావెల్‌ హార్డ్‌ హిట్టింగ్ చేస్తున్నారు. అక్షర్‌ పటేల్‌ బ్యాటు, బంతితో అంతగా రాణించలేదు. శార్దూల్‌, కుల్‌దీప్‌, నార్జ్‌ బౌలింగ్‌లో అదరగొడుతున్నారు. ఈ మ్యాచులో గెలవాలంటే కనీసం ఇద్దరు బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలు చేయాలి.


MIకి RCB సపోర్ట్‌


ముంబయి ఇండియన్స్‌ను దురదృష్టం వెంటాడుతోంది. గెలిచే మ్యాచుల్నీ వదిలేసుకుంటున్నారు. రోహిత్‌, ఇషాన్‌ కాస్త ఫామ్‌లోకి వచ్చారు. తిలక్‌ అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. టిమ్‌డేవిడ్‌ బ్యాటుతో చెలరేగుతున్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌కు తిరుగులేదు. ఈ మ్యాచులో మిచెల్‌ మార్ష్‌ను అడ్డుకోవడానికి ముంబయి తన స్పిన్నర్లను సమర్థంగా వినియోగించనుంది. రిషభ్‌ పంత్‌కు బుమ్రా బౌలింగ్‌లో మెరుగైన రికార్డు లేదు. కాబట్టి వారిద్దరూ జాగ్రత్తగా ఉండాలి. బహుశా ఈ మ్యాచులో సచిన్‌ కుమారుడు అర్జున్‌ను అరంగేట్రం చేయించే ఛాన్స్‌ ఉంది.


MI vs DC Probable XI


ముంబయి ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, రమన్‌దీప్‌ సింగ్‌, త్రిస్టన్‌ స్టబ్స్‌, టిమ్‌ డేవిడ్‌, డేనియెల్‌ సామ్స్‌, సంజయ్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, రిలే మెరిడీత్‌, మురుగన్‌ అశ్విన్‌ / మయాంక్‌ మర్కండే


దిల్లీ క్యాపిటల్స్‌: డేవిడ్‌ వార్నర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, మిచెల్‌ మార్ష్‌, రిషభ్‌ పంత్‌, లలిత్ యాదవ్‌, రోమన్‌ పావెల్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్, కుల్దీప్‌ యాదవ్‌, ఆన్రిచ్‌ నార్జ్‌, ఖలీల్‌ అహ్మద్‌