Chandrababu attends ex MLA Dayakar Reddy Funeral: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి భౌతిక కాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. దయాకర్ రెడ్డి స్వగ్రామానికి వెళ్లిన చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే కుటుంబసభ్యులను ఓదార్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో టీడీపీలో కీలక నేత అయిన దయాకర్ రెడ్డి మరణం పట్ల సంతాపం ప్రకటించి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు చంద్రబాబు.


నేటి ఉదయం దయాకర్‌రెడ్డి కన్నుమూత
తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దయాకర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దయాకర్ మరణం పట్ల పలు పార్టీలకు చెందిన కీలక నేతలు సంతాపం తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపురం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తకోట దయాకర్‌రెడ్డి టీడీపీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేలగా గెలిచారు. అమరచింత నుంచి రెండుసార్లు మక్తల్‌ నుంచి మరోసారి విజయం సాధించారు.






కొత్తకోట దయాకర్ రెడ్డి టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమరచింత నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దయాకర్ రెడ్డి.. 1994లో, 1999లో విజయం సాధించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి స్వర్ణ సుధాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభావం తగ్గడంతో 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం..
‘మాజీ ఎమ్మెల్యే, నా ఆప్తుడు కొత్తకోట దయాకర్ రెడ్డి గారి అకాల మరణం బాధాకరం. పాలమూరు జిల్లా నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ తెలుపుతూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ నేతలతో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తదితర నేతలు దయాకర్ రెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపారు. జన నేతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే సేవల్ని కొనియాడారు.


కొత్తకోట దయాకర్ రెడ్డికి భార్య సీతాదయాకర్ రెడ్డి, కమారులు సిద్ధార్థ, కార్తీక్ ఉన్నారు. సీతా దయాకర్ రెడ్డి 1994లో రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో దేవరకద్ర జడ్పీటీసి సభ్యులుగా విజయం సాధించి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ గా ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థిగా 2009లో దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాజకీయాల్లో వీరి ప్రభావం కొంతమేర తగ్గింది.