ఇప్పుడు కన్నడ సినిమా (Kannada Cinema) కాలర్ ఎగరేసి మరీ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందు నిలబడుతోంది. కన్నడ సినిమా వైపు ప్రేక్షకుల చూపు కూడా పడుతోంది. రాక్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన 'కెజియఫ్' రెండు భాగాలు, సుదీప్ 'విక్రాంత్ రోణ', రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కాంతార' సినిమాలు అని చెప్పాలి. 


ముఖ్యంగా మన మట్టి కథలకు ప్రేక్షకులు ఎంత విలువ ఇస్తారు? అనేది అందరికీ చెప్పిన సినిమా 'కాంతార'. తొలుత కర్ణాటకలో విడుదలైన ఆ సినిమా, ఆ తర్వాత ఇతర భాషల్లోకి అనువాదమై... పాన్ ఇండియా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. 'కాంతార'లో తాను బాల్యంలో చూసిన సంప్రదాయాల్ని రిషబ్ శెట్టి చూపించారు. 'కలివీరుడు' సినిమా కూడా ఆ తరహా చిత్రమే అని ఎం. అచ్చిబాబు చెబుతున్నారు. 


తెలుగులోకి 'కలివీరుడు'గా...
కన్నడ చిత్ర పరిశ్రమలో రియల్ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్సులతో పేరు పొందిన నటుడు ఏకలవ్య (Kannada Hero Ekalavyaa). ఆయన కథానాయకుడిగా నటించిన తొలి సినిమా 'కలివీర'. ది ఇండియన్ వారియర్... అనేది ఉపశీర్షిక. అవిరామ్ రచన, దర్శకత్వంలో జ్యోతి ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఇప్పుడీ సినిమాను తెలుగులో అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


'కలివీర'ను తెలుగులో 'కలివీరుడు' (Kaliveerudu Telugu Movie) పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ పంపిణీదారుడు, మినిమం గ్యారంటీ మూవీస్ అధినేత ఎం. అచ్చిబాబు సొంతం చేసుకున్నారు. తాజాగా సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. 


'కలివీరుడు' సినిమా గురించి ఎం. అచ్చిబాబు మాట్లాడుతూ ''కన్నడలో రూపొందిన ఈ సినిమా అక్కడ అనూహ్య విజయం సాధించింది. రికార్డు స్థాయి వసూళ్ళు సాధించింది. కన్నడలో కొత్త సినిమాకు అంత కలెక్షన్స్ రావడం చూసి ఇండస్ట్రీ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగులో కూడా సంచలన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. 'కలివీరుడు'గా రియల్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సులకు పెట్టింది పేరైన ఏకలవ్య అద్భుతంగా నటించారు. తెలుగు ప్రేక్షకులను కూడా ఆయన స్టంట్స్ ఆకట్టుకుంటాయి'' అని చెప్పారు. 


జూలైలో 'కలివీరుడు' విడుదల!
Kaliveerudu Release In July : వచ్చే నెల (జూలై) ద్వితీయార్థంలో 'కలివీరుడు' సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఎం. అచ్చిబాబు చెప్పారు. 'కాంతార' తరహాలో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగులోకి అనువాదం అవుతున్న మీడియం బడ్జెట్ కన్నడ సినిమాల లిస్టులో ఇప్పుడు 'కలివీరుడు' కూడా చేరింది. ఈ కోవలో మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Also Read : ప్రభాస్ అడగలేదు, మేమే కొన్నాం - 'ఆదిపురుష్' రైట్స్‌పై టీజీ విశ్వప్రసాద్


'కలివీరుడు' సినిమాలో ఏకలవ్య సరసన చిరా శ్రీ కథానాయికగా నటించారు. ఇంకా ఈ సినిమాలో డేని కుట్టప్ప, తబలా నాని, అనితా భట్ ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి పోస్టర్స్ : విక్రమ్ ఎ.హెచ్ - అనిల్ కొడాలి, ఛాయాగ్రహణం : హలేష్ ఎస్, కూర్పు : ఎ.ఆర్.కృష్ణ, నేపథ్య సంగీతం : రాఘవేంద్ర, నిర్మాత : ఎం. అచ్చిబాబు, రచన - దర్శకత్వం : అవి. 


Also Read ఏపీలో షూటింగులు - దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణ్ భరోసా!