టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, కొనేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఏసీబీ కోర్టు నిందితులకు రిమాండ్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో సైబరాబాద్ పోలీసులు ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను త్వరగా విచారణ చేయాలని హైకోర్టును కోరారు. అయితే, ఆ పిటిషన్ ను కోర్టు అత్యవసర విచారణకు నిరాకరించింది. సాధారణ పిటిషన్ వేయాలని, దాన్ని రేపు విచారణ చేస్తామని స్పష్టం చేసింది. 


41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ


ఈ కేసులో పక్కా ఆధారాలు, డబ్బులు దొరక్కపోవడం వల్ల ఏసీబీ కోర్టు నిందితులకు రిమాండ్‌ విధించలేమని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. నిందితులకు వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి ఆ తర్వాత విచారణ చేసుకోవాలని సూచించింది. ఏసీబీ జడ్జి ఆదేశాలతో నిందితులు సింహయాజి, రామచంద్రభారతి, నంద కుమార్‌కు ఇప్పటికే పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. తమ విచారణకు హాజరుకావాలని సూచించారు. ఏసీబీ కోర్టు జడ్జి నిర్ణయాన్ని సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాలు చేయడంతో ఉన్నత న్యాయస్థానం విచారణపై ఆసక్తి నెలకొని ఉంది. 


నిందితుడు నందకుమార్ వివరణ ఇదీ


పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురులో ఒకరైన నంద కుమార్.. తాను ఫాం హౌజ్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలియజేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. పూజల కోసం మాత్రమే తాము ఫాం హౌస్ కు వెళ్లినట్లు వివరించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా అక్కడ ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే తనకు తెలుసని నంద కుమార్ పేర్కొన్నారు. మిగతా ముగ్గురు వ్యక్తులు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. సింహయాజి స్వామీజీతో సామ్రాజ్య లక్ష్మి పూజ జరిపించడానికి బేరసారాలు జరిపినట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 


అసలు స్కాం గురించే తెలియదు..


అసలు స్కారం గురించి తమకు ఏమాత్రం తెలియదని నందకుమార్ వివరించారు. న్యాయాన్ని నమ్ముతున్నామని, న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని వివరించారు. త్వరలో మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు.


రూ.50 కోట్లు ఇస్తామంటూ ప్రలోభ పెట్టారని ఫిర్యాదు


టీఆర్ఎస్ (TRS) ను వీడి బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి రూ.100 కోట్లు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌ రెడ్డికి ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామంటూ ప్రలోభ పెట్టారని స్వయంగా రోహిత్‌ రెడ్డే ఫిర్యాదు ఇచ్చారు. దాని ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేసి విచారణ చేశారు.


రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌ ప్రాంతాన్ని సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad Police) తమ అధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు చేశారు. డబ్బు ఎక్కడైనా దాచారా అనే అనుమానంతో క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు వినియోగించిన కారు డ్రైవర్‌ తిరుపతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత డబ్బు రూ.15 కోట్లు అక్కడే ఉన్న ఓ బ్యాగులో దొరికిందని ప్రచారం జరిగింది. కానీ, ఆ బ్యాగులో ఆ స్వామీజీకి చెందిన బట్టలు ఉన్నాయి.